TRS MLC Kavitha: కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత మౌనముద్ర దాల్చారు. జాతీయ రాజకీయాలంటూ తండ్రి ఆవేశపు ప్రసంగం చేసినా అదే సభా వేదికపై ఉన్న కవిత ఏమాత్రం స్పందించలేదు. కనీసం ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో కూడా మాట్లాడలేదు. నిజామాబాద్‌ సభకు కవిత హాజరు కేవలం ప్రొటోకాల్‌ పార్టిసిపేషన్‌గా మారింది. ఈ పరిణామాలకు కారణమేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్‌ స్టోరీలో చూద్దాం...
 
కల్వకుంట్ల కవిత. టీఆర్‌ఎస్‌లో ఒకప్పుడు ఫైర్‌ బ్రాండ్‌. తండ్రి కేసీఆర్‌ రాజకీయ వారసత్వాన్ని ఔపోసన పట్టిన కవిత.. ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచేవారు. విపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్‌ ఇచ్చేవారు. తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలకు, టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసే ఇతర పార్టీల నేతలకు గట్టిగా సమాధానం చెప్పేవారు. ఒక దశలో సోదరుడు కేటీఆర్‌ కన్నా.. తానే వాగ్ధాటితో విపక్షాలకు చుక్కలు చూపించేవారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కవిత వాగ్ధాటికి మురిసిపోయేవారన్న వాదన కూడా ఉంది. అలాంటి కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం మౌనముద్ర దాల్చారు. అవకాశం వచ్చినా తను ఒకప్పటి మాదిరిగా జోక్యం చేసుకోవడం లేదు. యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేయడం లేదు. ముందరి మాదిరిగా విపక్షాలపై విమర్శల వర్షం కురిపించడం లేదు. మరి.. ఈ పరిస్థితికి కారణమేంటన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది. వీటినే ఇప్పుడు పొలిటికల్‌ యాక్టివిస్టులు అందరూ నెమరేసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అంతకుముందు, తెలంగాణ రాష్ట్రసమితి జిల్లా కేంద్ర కార్యాలయాన్ని కూడా సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అయితే, ఈ భవనాలను ప్రారంభించే కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత దూరంగా ఉన్నారు. తండ్రి వెంట కనిపించలేదు. కేవలం బహిరంగ సభా వేదికకే పరిమితమయ్యారు. అంతేకాదు.. ఎక్కడా గతంలో మాదిరిగా కవిత యాక్టివ్‌ రోల్‌ పోషించలేదు. సీఎం కేసీఆర్‌ పక్కనే కూర్చున్నప్పటికీ కవిత ప్రసంగించలేదు. మౌనంగా తండ్రి ప్రసంగాన్ని వినడానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేసీఆర్‌ హాజరైన రెండు కార్యక్రమాలు ప్రముఖమైనవే. తమ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం, కొత్త కలెక్టరేట్‌ భవన సముదాయం ప్రారంభోత్సవంపైనా.. స్థానిక ఎమ్మెల్సీ అయినప్పటికీ కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. కనీసం స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు గానీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యులతో గానీ మాట్లాడలేదు. కేవలం ప్రొటోకాల్‌ మేరకు కార్యక్రమాల్లో పాల్గొనేందుకే పరిమితమయ్యారు. పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఓ దశలో అసలు కవిత.. ఈ కార్యక్రమాలకు వచ్చారా? లేదా? అన్న చర్చ కూడా కొనసాగింది. 


నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల క‌విత నేరుగా హైద‌రాబాద్ నుంచి బహిరంగసభా వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ముందుగా పార్టీ కార్యాల‌య భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆమె హాజ‌రుకాలేదు. ఆ త‌ర్వాత కొత్త క‌లెక్ట‌రేట్ కార్యాల‌య స‌ముదాయాన్ని ప్రారంభించే కార్య‌క్ర‌మానికీ ఆమె హాజ‌రుకాలేదు. అక్క‌డే స‌భావేదిక‌పైనే ఆసీనులై కూర్చున్నారు. ఆ వేదిక మీద కూడా ఆమె ప్ర‌సంగించకుండా ముభావంగానే ఉండిపోయారు. మొక్కుబడిగా సభకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. ఈ పరిణామాలు నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తీవ్రమైన చర్చకు దారితీశాయి. 


కేసీఆర్‌ కూతురు అయిన కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్ని శాసిస్తారన్న పేరుంది. మొదటినుంచీ నిజామాబాద్‌ రాజకీయాల్లో అత్యంత చురుగ్గా ఉండే కవిత.. తెలంగాణ రాష్ట్రసమితికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా, ఏ పరిణామం చోటు చేసుకున్నా పార్టీని ముందుండి నడిపిస్తారన్న పేరుంది. ఓ రకంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్నీ తానై వ్యవహరించేవారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉండేవారు. ఓ రకంగా పార్టీని శాసించేవారు. తన వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకునేవారు. పార్టీ శ్రేణుల్లోనూ ఆదరణ సంపాదించారు. తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లాకు  ఎప్పుడు వచ్చినా కవిత హడావిడి కనిపించేది. ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకునేవారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్ల దగ్గరనుంచి.. జన సమీకరణదాకా తానే స్వయంగా చూసుకునేవారు. తండ్రి సభను సక్సెస్‌ చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. కేసీఆర్‌ సభ నిర్వహిస్తే ముందుగానే జిల్లాకు చేరుకొని ఏ లోటూ రాకుండా చూసుకునేవారు. కానీ, సోమవారం కేసీఆర్‌ పర్యటనలో మాత్రం ఆ ఒరవడి కనిపించలేదు. సభ ప్రారంభం కావడానికి అరగంట ముందు మాత్రమే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కవిత పూర్తిగా సైలెంట్‌గా ఉండిపోయారు. సభా ఏర్పాట్లలోనూ తన ప్రమేయం ఏమీ కానరాలేదు.
 
నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత దాదాపు మూడేళ్లపాటు కవిత సైలెంట్‌గా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నేళ్లపాటు దూరమయ్యారు. తర్వాత నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.  కొంతకాలం పాటు అడపా దడపా పర్యటనలు చేసినా.. కొన్నాళ్లకు అవి కూడా కనుమరుగయ్యాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు తగ్గిపోయాయి. దీంతో, జిల్లా టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లోనూ నైరాశ్యం అలుముకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తరచుగా ఏదో ఒక విషయంలో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కానీ కవిత ఏనాడూ కూడా అరవింద్ వ్యాఖ్యలపై నోరు మెదప లేదు. ఆమె మూడు సంవత్సరాలుగా మౌనంగానే ఉన్నారు. అయితే, ఇటీవలే మరోసారి కవిత మీడియా ముందుకు వచ్చారు. రెండు నెలల క్రితం నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై విమర్శల వర్షం కురిపించారు. పసుపుబోర్డు గరించి అర్వింద్‌ను తిట్టిపోశారు. పసుపు బోర్డు తెస్తానని రైతులకు అగ్రిమెంట్ చేసి గద్దెనెక్కిన అరవింద్ బూటకపు నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు.  నిధుల్లో అవకతవకలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇక, మళ్లీ కవిత ఫామ్‌లోకి వచ్చారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అంతా అనుకున్నారు. మళ్లీ యాక్టివ్‌ రోల్‌ పోషించవచ్చని, నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతుందనుకున్నారు. కానీ, మళ్లీ సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు తండ్రి కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నిర్వహించినా, జిల్లా కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించినా.. కవిత రోల్‌ మాత్రం కనిపించలేదు. తండ్రి.. రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలవైపు దూసుకెళ్తానంటూ ఆవేశపు ప్రకటన చేసినా, ఏకంగా జాతీయ స్థాయిలో సవాళ్లు విసిరినా , దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులందరికీ ఉచిత విద్యుత్‌ అందిస్తానని సంచలన హామీ ఇచ్చినప్పటికీ.. కవిత స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 
కేవలం తండ్రి సీఎం కేసీఆర్‌ సభకు నామమాత్రంగా హాజరయ్యారు కవిత. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కల్వకుంట్ల కవిత.. కేవలం ప్రొటోకాల్‌ మేరకే అధికారిక సభలో పాల్గొనడానికే పరిమితమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి