YS Sharmila: మీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం.. వైఎస్ షర్మిల కౌంటర్లు
YS Sharmila Slams Minister Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం అవుతుందని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
YS Sharmila Slams Minister Harish Rao: మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రతిపక్షాలు చేసేది గోబెల్స్ ప్రచారమైతే.. 9 ఏళ్లుగా అబద్ధాల పాలన చేసే మిమ్మల్ని ఏమనాలి హరీష్ రావు..? అంటూ ఆమె ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారానికి అసలుసిసలు వారసులు మీరు, మీ ముఖ్యమంత్రి అంటూ ఫైర్ అయ్యారు. బంగారు తునక అని చెప్పి 4.50 లక్షల కోట్ల అప్పులకుప్ప చేశారని.. అంత అప్పు చేసినా రుణమాఫీకి డబ్బు లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్‌లకు డబ్బు లేదు.. కొత్త పెన్షన్లకు డబ్బు లేదన్నారు. చివరకు జీతాలు ఇవ్వడానికి కూడా దిక్కులేక ఆస్తులు అమ్ముతున్నారని.. మీరు చేసిన అప్పులకు ఏడాదికి రూ.30 వేల కోట్ల మిత్తీలే కట్టాలన్నారు.
దేశానికి తెలంగాణ దిక్సూచి అంటే రాష్ట్రాన్ని అమ్మేసి.. అంధకారంలో నెట్టేయడమా..? అని షర్మిల నిలదీశారు. 50 లక్షలకు నిరుద్యోగులు పెరగడం ప్రగతి అంటారా..? అని అడిగారు.
బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని.. 9 ఏళ్లలో ముష్టి 65 వేల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమా..? అని నిలదీశారు. ఉద్యోగాలు రాక యువత ఉరికొయ్యలకు వేలాడటం రాష్ట్ర అభివృద్ధా..? అని అన్నారు. లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులను మోసం చేశారని.. 9 వేల మంది రైతులు ఆత్మహత్యలకు కారణం అయ్యారని మండిపడ్డారు.
1.20 లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే.. 1.52 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వడం ప్రగతికి అద్దం పట్టినట్లా..? అని ప్రశ్నించారు.
విద్యుత్ సంస్థలను దివాలా తీసి.. 26వేల కోట్ల అప్పులకు నెట్టారని.. ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పి రూ.10 వేల కోట్ల అప్పుల్లో ముంచారని ఆమె ఆరోపించారు. 26 వేల మందికే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి.. మిగతా ఇల్లు లేని 30 లక్షల మందిని మోసం చేశారని అన్నారు. 9 లక్షల కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లకు దిక్కే లేదన్నారు. ఫీజు రీఎయింబర్స్‌మెంట్ కింద 18 లక్షల మంది విద్యార్థులకు రూ.5వేల కోట్లు, రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఎగ్గొట్టారని విమర్శించారు. జీవోలు ఇచ్చి రూ.2 వేల కోట్ల నిధులివ్వకుండా సర్పంచులను చంపుకుతింటున్నారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం అవుతుందని సెటైర్లు వేశారు. మీ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టి దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని షర్మిల అన్నారు.
Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్
Also Read: MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. అప్పటివరకు నో అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి