Revanth Reddy About Pro. Haragopal: ప్రొ. హరగోపాల్‌తో పాటు మరో 152 మందిపైన తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పాలకులు ప్రజాస్వామ్య వాదులను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడిన రేవంత్ రెడ్డి... ప్రో. హరగోపాల్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు. ఆయన పౌర హక్కుల కోసం అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజా హక్కులను కాపాడిన మానవతా వాదీ అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సెంట్రల్ యూనివర్సిటీలలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించిన ప్రొఫెసర్ మాత్రమే కాదు.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేసిన ఉద్యమకారుడు కూడా అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మీద రహస్యంగా కేసులు నమోదు చేసి పెట్టి వేధించడం తెలంగాణ సర్కారుకు తగదు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్, హరగోపాల్ నక్సలైట్లకు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం ఒక అప్రజాస్వామిక చర్య అని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. ఒకవేళ ప్రభుత్వ దృష్టిలో హరగోపాల్ దోషి అయితే నక్సలైట్ల ఏజండానే మా ఏజండా అన్న కేసీఆర్ కూడా దోషినే కదా అని ప్రశ్నించారు. నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్ పైన కూడా దేశద్రోహం కేసులు పెడతారా అని రేవంత్ రెడ్డి పోలీసులను నిలదీశారు.


ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు మొత్తం 152 మంది పైన నమోదైన కేసులను ఎత్తివెయ్యాలి అని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌర, ప్రజాస్వామిక సంఘాలు రాజకీయపక్షాలు హరగోపాల్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. హరగోపాల్ తో పాటు 152 మందిపై ఉన్న ఉపా కేసులు ఎత్తెయ్యలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రజాస్వామిక పౌర సంఘాలు బిఆర్ఎస్, బిజేపీ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేస్తుండడంతో ప్రభుత్వాలు వారి పట్ల ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు 152 మందిపై నమోదైన కేసులు ఎత్తేస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఇలాంటి అప్రజాస్వామిక ప్రభుత్వం పోవాలంటే కేసీఆర్ ని గద్దె దించడం ఒక్కటే మార్గం అని ప్రజలకు పిలుపునిచ్చారు.