డ్యామ్ తెగి పోటెత్తిన వరదలు.. 32 మంది మృతి
కెన్యాలో భారీ వర్షాల కారణంగా డ్యామ్ తెగిపోవడంతో 32 మంది మృత్యువాత
కెన్యాలో భారీ వర్షాల కారణంగా నిండుగా నిండిన ఓ డ్యామ్ కట్టలు తెంచుకోవడంతో 32 మంది మృత్యువాతపడ్డారు. డ్యామ్ తెగిపోవడంతో డ్యామ్ పరిసరాల్లోని ఇళ్లు అన్నీ నేలమట్టమయ్యాయి. జనం నిద్రిస్తున్న సమయంలో ఈ ఘోరం జరగడంతో చాలామంది నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు నకురు వ్యాలీ పోలీసులు తెలిపారు. తప్పిపోయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని శవాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం వుంది అని అక్కడి పోలీసు అధికారి కిబుంజ తెలిపారు. ఇప్పటికే గత కొద్ది నెలలుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో దాదాపు 164 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకెంతో మంది గల్లంతయినట్టుగా అక్కడి అధికారులు తెలిపారు. ఈ వరదల కారణంగా 2లక్షల మంది నిరాశ్రయులవగా దాదాపు 20 వేల మూగజీవాలు ప్రాణాలు విడిచినట్లు అధికారవర్గాలు ప్రకటించాయి.
డ్యామ్ తెగిన చోట హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. చాలా శవాలు బురదలో కూరుకుపోవడం, మృతుల్లో అధికంగా చిన్నారులే వుండటం చూపరులని కంట తడి పెట్టించింది.