వాషింగ్టన్ : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా పౌరులెవరూ జమ్ము-కశ్మీర్‌లో పర్యటించరాదని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జమ్ముకాశ్మీర్‌లో పర్యటించే సమయంలో పాకిస్తాన్ సరిహద్దులకు 10 కిమీ దూరంలోనే ఆగిపోవాల్సిందిగా అమెరికా భద్రతా విభాగం తాజాగా విడుదల చేసిన లెవెల్ 2 ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది. తూర్పు లడఖ్‌, లేహ్‌ మినహా కాశ్మీర్‌లోని ఏ ప్రదేశానికి అమెరికా పౌరులు వెళ్లొద్దని అమెరికా తమ దేశ పౌరులను అప్రమత్తంచేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ వద్ద జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. 


ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే రద్దీగా వుండే పర్యాటక ప్రాంతాలు, బస్ స్టేషన్స్, మార్కెట్స్, షాపింగ్‌ మాల్స్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే ప్రమాదాలు వున్నాయని అమెరికా భద్రతా విభాగం ట్రావెల్‌ అడ్వైజరీలో హెచ్చరించింది. పుల్వామా దాడులు జరిగిన మరుసటి రోజే బ్రిటన్, ఆస్ట్రేలియా సైతం తమ పౌరులకు ఇటువంటి హెచ్చరికలనే జారీచేయడం గమనార్హం.