Dawood Ibrahim Cases: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ముంబై బాంబు పేలుళ్ల సుత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. విష ప్రయోగం జరిగిందని.. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ ఇబ్రహీం దశాబ్దాలుగా భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అలాగే ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడు. అతను ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జాబితాలో కూడా ఉన్నాడు. దావూద్ తలపై 25 మిలియన్ల డాలర్ల బహుమతి ఉంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో దావూద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. తన రూపాన్ని మార్చుకుంటూ.. మారుపేర్లు, నకిలీ పాస్‌పోర్ట్‌లతో తరచుగా తన స్థావరాలను మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీలో షేక్ దావూద్ హసన్ అనే మారుపేరుతో నివసిస్తున్నట్లు భావిస్తున్నారు.
 
1993 ముంబై పేలుళ్లు, 2008 ముంబై దాడులు, 2010 పూణే జర్మన్ బేకరీ పేలుడు, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వంటి అనేక క్రూరమైన నేరాలలో సూత్రధారిగా దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ ఆయుధాల స్మగ్లింగ్‌ కేసులు కూడా ఉన్నాయి. మన దేశానికి దావూద్ ఇబ్రహీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. దావూద్ సూత్రధారిగా ఉన్న టాప్-5 కేసులు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై పేలుళ్లలో 257 మంది మృతి


1993 ముంబై పేలుళ్లలో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనలో 257 మంది మరణించగా.. 700 మందికి పైగా గాయపడ్డారు. తన సహచరులు, పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహాయంతో పేలుళ్లకు ప్లాన్ చేసి అమలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పేలుడు పదార్థాలు, ఆయుధాలు, నేరస్థులకు శిక్షణ కూడా అందించాడు. ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌, ఎయిర్ ఇండియా బిల్డింగ్, శివసేన ప్రధాన కార్యాలయంతో సహా 12 చోట్ల పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం దుబాయ్‌కు పారిపోయి.. అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ ఐఎస్‌ఐ రక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. దావూద్‌ను అప్పగించాలని మన దేశం పదేపదే పాకిస్థాన్‌పై ఒత్తిడి చేస్తున్నా.. తమ దేశంలో లేడంటూ పాక్ బుకాయిస్తోంది. 


2008 ముంబై దాడులు


2008 ముంబైలో జరిగిన బాంబు దాడుల్లో దావూద్ ఇబ్రహీం పాత్ర కూడా ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 166 మంది మరణించగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. సముద్ర మార్గంలో ముంబైకి వచ్చిన లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, నారిమన్ హౌస్ వంటి ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. ఈ దాడులకు దావూద్ ఇబ్రహీం ఆర్థిక సహాయంతోపాటు ముంబై నుంచి తప్పించుకునేందుకు సహాయం చేశాడని అభియోగాలు ఉన్నాయి. 


2010 పూణే జర్మన్ బేకరీ బ్లాస్ట్


2010లో పూణే జర్మన్ బేకరీ పేలుడు ఘటనలో దావూద్ ఇబ్రహీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ పేలుళ్లలో 17 మంది చనిపోగా..  60 మందికి పైగా గాయపడ్డారు. విదేశీయులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే పూణేలోని కోరేగావ్ పార్క్ ప్రాంతంలోని ప్రముఖ జర్మన్ బేకరీలో ఈ పేలుడు సంభవించింది. మొబైల్ ఫోన్‌ ద్వారా బ్యాక్‌ప్యాక్‌లో అమర్చిన బాంబుతో పేలుడు జరిగింది. ఈ పేలుడుకు దావూద్ ఇబ్రహీం, లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ తామే బాధ్యులమని ప్రకటించింది. పేలుడు పదార్థాలు, మొబైల్ ఫోన్‌ను అందించినట్లు దావూద్ ఇబ్రహీం అందించినట్లు తెలుస్తోంది. 


2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం..


భారత క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దావూద్ ఇబ్రహీం ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లకు చెందిన కొంతమంది ఆటగాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్ కోసం పనిచేస్తున్న బుకీలు మరియు ఫిక్సర్లతో ఆటగాళ్లు సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్‌లు బెట్టింగ్ రాకెట్‌ను నడిపించారని.. అక్రమంగా జూదంలో భారీగా లాభాలు గడించారు. తమకు సహకరించాల్సిందిగా ఆటగాళ్లను, జట్టు యాజమాన్యాన్ని బెదిరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 


ఈ ప్రధాన కేసులే కాకుండా అనేక హత్య, దోపిడీ, కిడ్నాప్, స్మగ్లింగ్ వంటి అనేక ఇతర కేసులలో కూడా వాంటెడ్‌గా ఉన్నాడు దావూద్ ఇబ్రహీం. 2011లో జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్య సంచలనం రేకెత్తించంది. దావూద్ ఇబ్రహీం చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి రాసినందుకు ఆయన అనుచరులే హత్య చేశారు. 1997లో సంగీత బారన్ గుల్షన్ కుమార్ హత్య కూడా ఇలానే జరిగింది.