ఒకే వేదికపై హాఫీజ్, పాలస్తీనా రాయబారి
పాకిస్థాన్ లో ఉంటున్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్-ఏ- తోయిబా సహ వ్యవస్థాపకుడు హాఫిజ్ సయీద్ ర్యాలీలో పాలస్తీనా రాయబారి హాజరుకావడంపై భారత్ తీవ్రంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ లో ఉంటున్న ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్-ఏ- తోయిబా సహ వ్యవస్థాపకుడు హాఫిజ్ సయీద్ ర్యాలీలో పాలస్తీనా రాయబారి (దౌత్యవేత్త) హాజరుకావడంపై భారత్ తీవ్రంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మేము పాలస్తీనా అధికారులతో మాట్లాడుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
"ఈ విషయంపై మేము నివేదికలు చూశాము. మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. న్యూఢిల్లీలోని పాలస్తీనా దౌత్యవేత్తతో, పాలస్తీనా అధికారులతో మేము మాట్లాడుతున్నాం" అన్నారు.
పాలస్తీనా రాయబారి వాలిద్ అబూ అలీ.. శుక్రవారం పాకిస్థాన్ రావల్పిండిలోని లియాకత్ బాగ్లో డిఫా-ఇ-పాకిస్థాన్ కౌన్సిల్ నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొని మద్దతిచ్చారు. వాలిద్ ర్యాలీలో హఫీజ్ తో కలిసి వేదికను పంచుకున్నారు. వేదికను పంచుకుంటున్న ఈ ఇద్దరి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పాకిస్థాన్ లో ఇస్లామిక్ గ్రూపుల సమ్మేళనం డిఫా-ఇ-పాకిస్తాన్ (డిఫెన్స్ ఆఫ్ పాకిస్థాన్) కౌన్సిల్ (డిపీసీ) 2012లో ఏర్పాటైంది. ఇది పాకిస్థాన్ ప్రభుత్వంపై భారత్, యుఎస్ సంబంధాలను తెంచుకోవాలని ఒత్తిడి తీసుకొస్తోంది. హఫీజ్ ను ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. పాకిస్థాన్ లో వేదికల్లో, ఫోరమ్ లలో పాల్గొని సయీద్ భారతదేశం, అమెరికాలకు వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేసాడు.
కాగా.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 127 దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరిపోయింది.