పాకిస్థాన్ క్రమక్రమంగా అమెరికా చేతుల్లోంచి చైనా చేతుల్లోకి వెళ్లిపోతోందని స్వయంగా అమెరికా ఇంటెలిజెన్సీ వర్గాలు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని హెచ్చరించాయి. 2019 వరకు పాకిస్థాన్ క్రమక్రమంగా అమెరికా నుంచి దూరం జరిగి చైనాకు మరింత దగ్గరయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రంప్ సర్కారుకి హెచ్చరికలు జారీచేశాయి. అది కూడా ఒకటి కూదు.. రెండు కాదు.. ఏకంగా 17 ఇంటెలిజెన్స్ సంస్థలు ట్రంప్ సర్కార్‌కి ఇవే హెచ్చరికలను జారీచేశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, దక్షిణాసియాలో పాకిస్థాన్ నుంచి వాషింగ్టన్‌కి ముప్పు తప్పదని సదరు ఇంటెలీజెన్స్ వర్గాలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ మేరకు పాకిస్థాన్‌కే చెందిన ప్రముఖ దిన పత్రిక డాన్ ఓ కథనాన్ని ప్రచురించడం గమనార్హం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటెలీజెన్సీ పరంగా అమెరికా కీలకంగా భావించే సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ ( ఎన్ఎస్ఏ) లాంటి ప్రధానమైన సంస్థలు వున్నాయి. మరిన్ని సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలని సమకూర్చుకుంటూ, మిలిటెంట్లను ప్రోత్సహించే పాకిస్థాన్‌తో భవిష్యత్‌లో అమెరికాకు ముప్పు లేకపోలేదని ఆ సంస్థలు తమ నివేదికలో స్పష్టంచేశాయి. 


పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందే ఉగ్రవాద సంస్థలు.. అక్కడి నుంచే భారత్, అఫ్ఘనిస్థాన్‌లలో ఉగ్రదాడులకి వ్యూహరచన చేయడం జరుగుతుందని అమెరికా ఇంటెలీజెన్స్ వర్గాలు ఆ దేశ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల్లో పేర్కొనడం ఒక విధంగా భారత్‌కి కలిసొచ్చే అంశం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.