అలర్ట్: ఎన్నారైలకు అమెరికా సర్కార్ బ్యాడ్ న్యూస్!
ఎన్నారైలకు బ్యాడ్ న్యూస్ చెప్పనున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పలు కఠిన నియమాలు అమలులోకి రావడంతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటున్న ఎన్నారైలకు త్వరలోనే అమెరికా సర్కార్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పనుంది. అదేమంటే, H-1B వీసాదారుల కుటుంబసభ్యుల(జీవిత భాగస్వామి, వారి సంతానం)కు జారీచేసే H-4 వీసాలను మరో మూడు నెలల్లో ఉపసంహరించుకోనున్నట్టు డొనాల్డ్ సర్కార్ అక్కడి ఫెడరల్ కోర్టుకు తెలిపింది. ఒకవేళ అదే కానీ జరిగితే ప్రస్తుతం H-1B వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులతోపాటు వారిపై ఆధారపడుతూ అక్కడ ఉంటున్న వారి జీవిత భాగస్వామి, సంతానానికి సైతం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడక తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికా విదేశాంగ చట్టాల ప్రకారం అక్కడి అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) విభాగం ఈ H-4 వీసాలను మంజూరు చేస్తుంది. H-1B వీసా కలిగిన భారతీయులకు వారి జీవిత భాగస్వామితోపాటు 21 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారి సంతానానికి యూఎస్‌సీఐఎస్ ఈ H-4 వీసాలు మంజురు చేస్తుంది.
అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులు తమ కుటుంబసభ్యులను అమెరికా తీసుకెళ్లడంలో ప్రస్తుతం ఈ H-4 వీసా ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం, దాని వెనుకున్న కారణాల గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.