పశ్చిమాసియా దేశాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. కల్లోలిత యెమెన్, గల్ఫ్ దేశం సౌదీ అరేబియాపై బాలిస్టిక్ క్షిపణి దాడి ప్రయోగించింది. ఈ క్షిపణి సౌదీ రాజధాని రియాద్ పై దూసుకువచ్చింది. అయితే, దీనిని సౌదీ విజయవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో దాని శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేలకూలాయి. ఈ మేరకు సౌదీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మరోవైపు, ఈ క్షిపణి దాడికి పాల్పడింది తామేనని షితే హుతి రెబల్స్ ప్రకటించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమపైకి దూసుకొచ్చిన క్షిపణిని కూల్చేసిన సమయంలో కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీగా ప్రాణనష్టం కలిగించాలని, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ క్షిపణి దాడి జరిగిందని అధికారులు ప్రకటించారు. దాదాపు 1200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. 


సౌదీపై ఇలా క్షిపణి దాడి జరగడం ఇది రెండోసారి. ఇదే ఏడాది జులైలో సౌదీఅరేబియాలోని పవిత్ర స్థలం మక్కాపై క్షిపణి దాడి ప్రయోగించగా, సౌదీ రక్షణదళం విజయవంతంగా తిప్పికొట్టింది.