శ్రీలంక పేలుళ్లు: 200 దాటిన మృతుల సంఖ్య, ఏడుగురు అనుమానితుల అరెస్ట్!
శ్రీలంక పేలుళ్లు: 200 దాటిన మృతుల సంఖ్య, ఏడుగురు అనుమానితుల అరెస్ట్!
శ్రీలంక: శ్రీలంకలో చోటుచేసుకున్న వరుస పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఆధివారం ఉదయం 8:45 గంటల నుంచి మొదలుకుని ఆరు గంటల వ్యవధిలో మొత్తం ఎనిమిది చోట్ల పేలుళ్లు జరిగాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్లలో ముందుగా దాడులు జరిపిన ఉగ్రవాదులు ఆ తర్వాత మరో రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడ్డారు. దీంతో మొదట 129, ఆ తర్వాత 162కి చేరిన మృతుల సంఖ్య కడపటి వార్తలు అందే సమయానికి 215 కి చేరింది.
క్షతగాత్రుల సంఖ్య 400కుపైగానే ఉండగా అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. వరుస పేలుళ్లతో పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండేందుకు శ్రీలంక సర్కార్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది.
ఈ పేలుళ్ల ఘటనకు సంబంధించిన వ్యవహారంలో ఏడుగురు అనుమానితులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుళ్ల వెనుకున్న కుట్ర కోణాన్ని వెలికి తీసుకొచ్చే పనిలో లంక పోలీసులు బిజీ అయ్యారు.