భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన సింగపూర్‌లోని చంగీ నేవల్ బేస్ ప్రాంతాన్ని సందర్శించగా.. అధికారులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అక్కడ ఆయన కొద్ది సేపు ఇండియన్ నేవీ ఆఫీసర్లతో పాటు రాయల్ సింగపూర్ నేవీ ఆఫీసర్లను కూడా కలిసి ముచ్చటించారు.


ఈ సందర్భంగా భారతీయ సైన్యంతో పాటు రాయల్ సింగపూర్ నేవీ నావికులు మోదీకి వినూత్నంగా స్వాగతం పలికారు. "భారత్ మాతాకీ జై" నినాదాలతో నేవల్ బేస్‌ని హోరెత్తించారు. ఈ సందర్శనకు మోదీతో పాటు సింగపూర్ రక్షణ మంత్రి మహమ్మద్ మాలికి ఓస్మా్న్ కూడా వచ్చారు. ఈ సందర్శన తర్వాత మోదీ ట్వీట్ చేశారు. "భారత్, సింగపూర్ తీర ప్రాంతాల్లో కూడా సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి. చంగీ నేవల్ బేస్‌లో ఇరు దేశాల నేవీ అధికారుల మధ్య ఎంత బలమైన బంధం ఉందో చూశాను" అని ట్వీట్ చేశారు.