AP Assembly passes resolution : ఏపీ శాసన మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం
ఏపీ అసెంబ్లీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దు చేయాలనే ప్రతిపాదనతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన డ్రాఫ్టు బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం.. సభకు హాజరైన 133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసన మండలి రద్దు చేయాలనే ప్రతిపాదనతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ అనంతరం సభ్యులు ఆ తీర్మానానికి తమ ఆమోదం తెలిపారు. అంతకంటే ముందుగా మండలిని రద్దు చేయాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ సైతం ఆమోదం ప్రకటించింది. ఆ తర్వాతే సీఎం వైఎస్ జగన్ ఆ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఏపీ శాసన మండలి రద్దు ఆవశ్యకతపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో మాట్లాడుతూ.. ''రాష్ట్రంలోని ప్రజా ప్రయోజనాల కోసం సర్కార్ ప్రవేశపెడుతున్న కీలక బిల్లులను శాసన మండలిలో ఉన్న టీడీపీ అడ్డుకుంటోందని.. అంతేకాకుండా శాసన మండలిని నిర్వహించడం సైతం ప్రభుత్వానికి భారంగా మారింది'' అని అన్నారు. అందుకే శాసన మండలి రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం వైఎస్ జగన్ సభకు వివరించారు.
Related article : మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు: యనమల రామకృష్ణుడు
సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన డ్రాఫ్టు బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం.. సభకు హాజరైన 133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. సభకు హాజరైన సభ్యులంతా ఓటు వేయడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటిస్తూ బిల్లు వివరాలను స్పీకర్ సభలో చదివి వినిపించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..