AP Politics: ఏపీలో మారుతున్న సమీకరణాలు, టీడీపీ-జనసేన పొత్తుపై నీలినీడలేనా
AP Politics: ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్తా..టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే మీమాంసలో నలిగిపోతోంది.
ఏపీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరవరకూ సమయమున్నా రాజకీయం అప్పుడే వేడెక్కేసింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు తరువాత రాజకీయం మారింది. మోదీ-పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం పొత్తుల సమీకరణాలే మారిపోయేలా కన్పిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 175 సీట్లకు టార్గెట్ పెట్టుకుంటే..అటు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఇదే చివరి ఎన్నిక, ముఖ్యమంత్రిని చేయమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశించిన రోడ్‌మ్యాప్ బీజేపీ నుంచి వచ్చిందా లేదా అనేది సందేహంగా మారింది.
ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా..రాజకీయాలు మాత్రం వేడెక్కేశాయి. 175కు 175 అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేస్తుంటే..ఇదే చివరి ఎన్నిక..సీఎం చేయమంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశించిన రోడ్‌మ్యాప్ బీజేపీ నుంచి వచ్చిందా లేదా అనేది సందేహంగా మారింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి
సాధారణంగా..ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది సహజం. ఆ ఓటు ఎంతవరకూ ఉంది, ప్రతిపక్షాలు ఎంతవరకూ ఆ ఓటును దక్కించుకుంటాయనే విషయంపైనే ప్రతిపక్షాల విజయం ఆధారపడి ఉంటుంది. ఏపీ విషయంలో ప్రతిపక్షాలు మూడున్నాయి. ఇందులో తెలుగుదేశం, జనసేన ప్రధానంగా ఉంటే..బీజేపీ నామమాత్రంగా ఉంది. ప్రభుత్య వ్యతిరేక ఓటు చీలనివ్వనంటున్న జనసేనాని మాటల నేపధ్యమే పొత్తుల సమీకరణాలకు దారితీస్తోంది.
రాష్ట్రంలో జనసేన-బీజేపీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. అటు విశాఖ నోవాటెల్ హోటల్ ఉదంతం అనంతరం జనసేన-టీడీపీ మధ్య బంధం బలపడసాగింది. అదే సమయంంలో ఈ ఇద్దరి మధ్య బంధం బీజేపీకు ఏ మాత్రం ఇష్టం లేని పరిణామం. జనసేన-టీడీపీ ఇద్దరూ కలిస్తే అధికార పార్టీ ఇరకాటంలో పడినట్టేనని అందరూ భావించారు.
మోదీ పర్యటన అనంతరం ఏం జరిగింది
ఇక మరోవైపు ప్రధాని మోదీ పర్యటన పొత్తు సమీకరణాల్ని మలుపు తిప్పినట్టుగా తెలుస్తోంది. మోదీ విశాఖ పర్యటనలో జనసేనానిని పిలిపించుకుని మాట్లాడారు. మోదీ-పవన్ మధ్య ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు కానీ..అప్పట్నించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి మారింది. పవన్ కళ్యాణ్‌లో దూకుడు కాస్త తగ్గిందనే వాదన విన్పిస్తోంది. అటు జనసేనతో పొత్తు కోరుకున్న చంద్రబాబు..హఠాత్తుగా ఇదే చివరి ఎన్నిక, ముఖ్యమంత్రిని చేయమంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు వైఖరే ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తోంది.
మారిన చంద్రబాబు వైఖరి
జనసేనతో బంధం కోరుకుంటే..ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే ఉండే అవకాశం లేదు. పవన్ ముఖ్యమంత్రి అభ్యర్ధి కావాలి లేదా ఇద్దరూ పదవిని పంచుకోవాలి. అలాగయితేనే జనసేన కార్యకర్తలు టీడీపీతో కలిసి దూకుడుగా పనిచేసే అవకాశాలున్నాయి. లేకపోతే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకే పవన్ తాపత్రయమనే వైసీపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టవుతుంది. ఇద్దరూ కలిసి పనిచేయాలనుకున్నప్పుడు సీట్లు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ తప్పకుండా ఉండాల్సిందేననే వాదన వస్తోంది.
టీడీపీ-జనసేన పొత్తు ప్రశ్నార్ధకమేనా
అటు బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తు వద్దంటోంది. జనసేనతో కలిసే 2024 ఎన్నికలకు వెళ్తామని పదే పదే చెబుతోంది. మోదీ-పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం కూడా బీజేపీ ఇదే స్పష్టం చేస్తోంది. కానీ టీడీపీని వదిలి బీజేపీ ఒక్కపార్టీతో కలిసి వెళ్తే జనసేనాని ఆశించిన ప్రయోజనం నెరవేరదనేది సుస్పష్టం. అందుకే ఇప్పుడు జనసేనాని పయనం ఎటు అనేది సందేహంగా మారింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో సందిగ్దంలో ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
అంటే స్థూలంగా చెప్పాలంటే పొత్తు సమీకరణాలు ఏపీలో ఎటుంటాయనేది అర్ధం కావడం లేదు. అటు తిరిగి ఇటు తిరిగి అసలు పొత్తులే లేకుండా పయనిస్తారా అనే అనుమానాలు లేకపోలేదు. అంటే ఎవరిదారి వారు చూసుకుంటారా అన్పిస్తోంది.
Also read: Vikram S: మరికొన్ని గంటల్లో నింగిలోకి భారత తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-ఎస్'..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook