గ్లోబాల్ వార్మింగ్ ఎఫెక్ట్: పగలు భగభగ.. సాయంత్రం చిటపట
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో విచిత్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గ్లోబర్ వార్మింగ్ కారణంగా పగలంతా ఎండలు మండిపోతుంటే,సాయంత్రం చల్లటి గాలులు,వర్షాలు కురుస్తున్నాయి. ప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పెనుగాలులు విరుచుకుపడతాయో.. ఎప్పుడు భానుడు భగభగ మంటాడో తెలియక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఏపీ, తెలంగాణలోనే కాదు దేశం మొత్తం పరిస్థితి ఇంతే.. ! ఉత్తర భారతంలో ఇసుక తుఫాన్లు మళ్లీ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
ఇవాళ, రేపు మరింత జాగ్రత్తగా ఉండండి
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. 40-44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుండగా.. ఆది, సోమవారాల్లో తెలంగాణ సహా ఏపీలోని పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కావున ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని.. చిన్నారులు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించింది.
పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి
మంచిర్యాల జిల్లాలో గత అర్థరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. భీమారం (మం) ఆరేపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి చెందారు. పలుచోట్ల మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడవగా.. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు వరంగల్ జిల్లాలో కూడా జోరు వర్షం కురవగా.. రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.