Heavy Rains in Telangana: హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్‌ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. అయితే శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. జూన్ నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరం వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 28 నుంచి వెనుదిరగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం బలహీనపడినా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో.. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. Also read: AP ICET-2020 ఫలితాలు విడుదల.. 78శాతం మంది ఉత్తీర్ణత


ఇదిలాఉంటే.. తెలంగాణలోని రంగారెడ్డి (Rangareddy) జిల్లా నందిగామ‌లో అత్య‌ధికంగా 18.3 సెం.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదుకాగా.. క‌రీంన‌గ‌ర్ జిల్లా చిగురుమామిడిలో 17.9, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఇల్లంత‌కుంట‌లో 15.5, రంగారెడ్డిలోని కోతూర్‌లో 14.3, ఫ‌రూక్‌న‌గ‌ర్‌లో 14.3, వ‌రంగ‌ల్ రూరల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలో 13.9, సూర్యాపేట జిల్లా న‌డిగూడెంలో 13.8 సెం. మీ. చొప్పున వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యింది. దీంతోపాటు ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నారు. చెరువులతో పాటు భారీ ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.   Also read: MS Dhoni, CSK vs DC match: చెన్నై బ్యాట్స్‌మెన్, బౌలర్లపై కన్నెర్ర చేసిన ధోనీ