Mahesh Kathi: నాడు చంద్రబాబు.. నేడు జగన్ అంతే!: కత్తి మహేష్ విమర్శలు
తరచుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలను, ఆయన పాలనను ప్రశంసించే సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా రూటు మార్చారు. చంద్రబాబుకు, వైఎస్ జగన్ సర్కార్కు ఏ తేడా లేదంటూ పోస్ట్ చేశారు.
అమరావతి: పేద విద్యార్థులకు వరంగా మారనున్న ‘అమ్మ ఒడి’ పథకం ఈ జనవరి 9వ తేదీన ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తొలుత స్కూలు విద్యార్థులకు అమలుచేయాలని భావించినా.. తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకూ అమ్మ ఒడిని వర్తింపచేశారు. ఈ పిల్లలను పాఠశాల, కాలేజీలకు పంపుతున్న నిరుపేద తల్లులకు ఏడాదికి రూ.15వేల చొప్పున ఏపీ సర్కార్ ఆర్థిక తోడ‍్పాడు అందించాలని నిర్ణయించింది.
తరచుగా వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించే సినీ విమర్శకుడు కత్తి మహేష్ ఈసారి విమర్శించారు. ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ‘అమ్మ ఒడి’ పథకం నిధుల వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ మండిపడ్డారు. ‘ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను అమ్మ ఒడి పథకం కోసం ఏపీ సర్కార్ పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. గతంలో చంద్రబాబు సర్కార్ ఎస్సీల అభ్యున్నతిని అడ్డుకున్న తీరుగా ప్రస్తుతం వైఎస్ జగన్ సర్కార్ పాలన సాగుతోంది. ఈ విధానాలను ఇకనైనా కొనసాగించరాదని’ కత్తి మహేష్ సూచించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని ‘అమ్మఒడి’ పథకానికి వినియోగించాలంటూ ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోను ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన పోస్ట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలిచ్చిన నవరత్నాల అమలులో వైఎస్ జగన్ సర్కార్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండగా.. తాజాగా అమ్మ ఒడి పథకం నిధుల కేటాయింపులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వ ఇతర పథకాలకు కేటాయించడంపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. బలహీన వర్గాల నిధులను వారికే వినియోగించి ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..