Minister Gudivada Amarnath: విశాఖ మీకు ఏం అన్యాయం చేసింది..? చంద్రబాబు, పవన్‌పై మంత్రి గుడివాడ ఫైర్
Executive Capital Visakhapatnam: విశాఖపట్నానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి గుడివారం ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్ర రాష్ట్రంలో భాగంగా కానట్లు విషయం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ ఎప్పుడైనా రాష్ట్రంలో ఉన్నారా..? అని ప్రశ్నించారు.
Executive Capital Visakhapatnam: వైజాగ్ మీకు ఏం అన్యాయం చేసింది..? ఇక్కడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఎందుకు వద్దంటున్నారు..? అని టీడీపీ నేతలను మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నం సర్క్యూట్‌హౌజ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ రాష్ట్రంలో లేదా..? ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంపై ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నారు..? అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చని.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. విశాఖపట్నం ఎంతో శక్తివంతమైన నగరం అని.. నగరానికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పొలిటికల్ టూరిస్టులుగా చంద్రబాబు.. ఆయన పుత్రులు ప్రభుత్వ నిర్ణయాన్ని అదే పనిగా తప్పుపడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ప్రజలు హర్షిస్తున్నారని.. ఇకనైనా చంద్రబాబు వాస్తవాలు గుర్తించి వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
"విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి నిన్న ప్రభుత్వం జీవో జారీ చేసింది. శాఖలకు నగరంలో భవనాల కేటాయింపును అందులో వివరించారు. దీనిపై ఉత్తరాంధ్ర బిడ్డగా, ఈ ప్రాంత ప్రజలందరి తరపున సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే దీనిపై ఎల్లో మీడియా మాత్రం నిన్నటి నుంచి విషం కక్కుతోంది. ఉత్తరాంధ్ర అసలు ఈ రాష్ట్రంలో లేనట్లు, ఈ ప్రాంతంపై అక్కసు వెళ్లగక్కుతోంది. రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టుగా వచ్చి పోతున్న చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు కానీ, దత్తపుత్రుడు కానీ.. టీడీపీ అనుకూల మీడియా కానీ.. అందరూ ఈ ప్రాంతానికి ప్రభుత్వ కార్యాలయాలు ఎలా తరలిస్తారని బాధ పడుతున్నారు. ఈ ప్రాంతంపై కోపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు తప్ప, ఈ నాలుగున్నర ఏళ్లలో ఏనాడైనా 50 రోజులు రాష్ట్రంలో ఉన్నారా..?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ కేవలం గెస్టుగానే ఉన్నారు తప్ప, ఏనాడూ ఈ ప్రాంతాన్ని ఓన్ చేసుకోలేదు. ఆయన సొంత ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉంది. ఓడిపోయిన తర్వాత మొత్తం ఆయన అక్కడే ఉంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు కానీ, ఆయన అనుకూల మీడియా కానీ ఒప్పుకోవడం లేదు. కేవలం గ్రాఫిక్స్‌లో చూపిన అమరావతి నుంచే పరిపాలన సాగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు తరలిస్తే, అమరావతిలో తమ భూములకు విలువ పడిపోతుందని చంద్రబాబు భయం. ఆందోళన. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోతామని భయం. అదే వారిలో బాధ. అదే కనిపిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని కానీ, బాగా వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర కూడా బాగు పడుతుందని కానీ, శక్తివంతమైన నగరంగా విశాఖ అభివృద్ధి చెందుతుందని కనీస ఆలోచన చేయడం లేదు. ఇది బాధాకరం. విశాఖ పేరు ఎత్తినా, అక్కడి నుంచి పరిపాలన చేస్తామని చెప్పినా సరే.. ఈ ప్రాంతంపై చంద్రబాబు, ఆయన కుమారుడు ఈ ప్రాంతంపై విషం కక్కుతున్నారు. చివరకు ఇదే ప్రాంతానికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడం సరికాదు. దీన్ని ఇక్కడి ప్రజలు క్షమించరు.
నగరంలోని మిలేనియం టవర్స్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తే, అక్కడ ఐటీ పరిశ్రమలు రావని రాయడం దారుణం. అది 2 లక్షల చదరపు అడుగుల్లో కట్టిన భవనం. అది ప్రభుత్వానిది. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పెడితే తప్పేమిటి..? ప్రభుత్వ నిర్ణయం వల్ల విశాఖకు ఐటీ పరిశ్రమలు రావా..? ఏమిటా రాతలు..? విశాఖ మీకు ఏం అన్యాయం చేసింది..? ఎందుకా విమర్శలు. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. మీరు మాత్రం అదే పనిగా విషం చిమ్ముతున్నారు.." మంత్రి గుడివాడ ఫైర్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook