సీన్ అదే.. పాత్రలు మారాయి. అప్పుడు అన్నయ్య..ఇప్పుడు తమ్ముడు. ఇంతకీ విషయమేమిటంటే.. 2009 ఎన్నికల్లో వైఎస్ అధికారం చేపట్టడానికి చిరంజీవి పరోక్షంగా కారణమయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి జనాల్లోకి వెళ్లిన చిరు.. ఎన్నికల సమయంలో అధికారం చేపట్టలేకపోయినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చడంలో సఫలమయ్యారు. దీంతో అప్పటి అధికార పార్టీ కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం చేపట్టే వీలు కలిగింది.. ఇప్పుడు కూడా ఇవే తరహా రాజకీయ పరిణామాలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 అప్పుడు అన్నయ్య.. ఇప్పుడు తమ్ముడు


అప్పుడు అన్నయ్య చిరంజీవి అనుసరించిన ఫార్మూలా ఇప్పుడు తమ్ముడు పవన్ అనుసరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది ..అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ..ఇప్పుడు అధికారపక్షంగా ఉండటం కొసమెరుపు. టీడీపీకి అన్న చిరంజీవి కల్గించిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత ..తమ్ముడు పవన్ తన భుజస్కంధాలపై వేసుకున్నారనే ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి..ఎవరి కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ.. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చీల్చేందుకు పవన్ సిద్ధమౌతున్నారు. అయితే దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 


ఉన్నది ఒకే ఫార్మలా...


ప్రతిపక్ష ఓట్లు చీలకుండా ఉండేందుకు జగన్ ముందు ఒకే ఒక ఫార్ములా ఉంది.. అది పవన్‌ను కలుపుకుపోవడం. అయితే ఇప్పటి వరకు జగన్ కానీ..పవన్ కానీ ఒక వేదికను పంచుకున్న దాఖలాలు లేవు. అటు పవన్ కానీ..ఇటు జగన్ కానీ కలిసి ప్రజా సమస్యలపై పోరాడాలన్న ఆసక్తి ఇప్పటి వరకు కనబరచలేదు.. అయితే ఇక్కడ జగన్‌కే పవన్ అవసరం ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే పవన్ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై జగన్ స్టాండ్ ఎలా ఉంటుందో భవిష్యత్తే తెల్చుతుంది..అప్పటి వరకు ఈ కథ సస్పెన్స్‌గా ఉండబోతోంది. కాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.