TDP Vs Janasena: ఆ నియోజకవర్గంలో టీడీపీకి జనసేన చెక్.. ప్లాన్ రివర్స్..?
Andhra Pradesh Politics: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో జనసేనకు పెరుగుతోన్న ఆదరణ తెలుగుదేశం పార్టీ మనుగడకు ఎసరు పెడుతోందా..? క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటు బ్యాంకు.. జనసేన పార్టీకి డైవర్ట్ అవుతోందా..? టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తణుకు సీటును జనసేనకు కేటాయించే అవకాశం కనిపిస్తోందా..? టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పరిస్థితి ఏంటి..?
Andhra Pradesh Politics: ఏపీలో మరో ఏడాది ఎన్నికలకు టైమ్ ఉన్నా.. స్థానికంగా నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఒక వేళ పొత్తులు ఖరారు అయితే.. టికెట్ తమకంటే తమకు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలకు రిక్వెస్టులు పంపిస్తున్నారు. లోకల్‌గా కూడా తమ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తణుకు నియోజకవర్గంలో టీడీపీని మించి జనసేన బలం పెరిగిందని.. జనసైనికులు అంచనా వేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పోటీ పడే సత్తా తమకే ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కచ్చితంగా తణుకు నుంచి జనసేన పార్టీ అభ్యర్ధిని పోటీలో నిలపాలని పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. అధికార వైసీపీని ఎదుర్కోవటానికి అటు టీడీపీ, జనసేన పార్టీలు.. తమలో తాము పోటీ పడుతున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ కన్నా.. జనసేన పార్టీకే కాస్త ఎడ్జ్ ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన పలు సర్వే రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
కొంతమంది కార్యకర్తలను వెంటేసుకుని మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ హడావుడి చేస్తున్నా.. గ్రామాల్లో చాపకింద నీరులా జనసేన పార్టీ విస్తరిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు జనసేన పార్టీకి షిప్ట్ అవుతున్నట్టు చెబుతున్నారు. అధికార వైసీపీ ఓటు బ్యాంకు మరింతగా కన్సాలిడేట్ అవుతుండగా.. టీడీపీ నుంచి జనసేనకు ఓటు బ్యాంక్ షిప్ట్ అవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో డిఫెన్స్‌లో పడుతున్న మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి.. ఎల్లో మీడియాలో తనకు అనుకూలంగా వండి వార్చిన కథనాలను రాయించుకుంటున్నారని చెబుతున్నారు. తనకు లేని బలాన్ని ఎక్కువగా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ తణుకులో జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితి ఇది..
వాస్తవానికి తణుకు నియోజకవర్గంలో మొత్తం 44 గ్రామాలు ఉండగా.. దాదాపు 90 శాతం గ్రామాల్లో మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో వైసీపీ హవా కనిపిస్తోంది. గతంలో జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ జైత్రయాత్ర కొనసాగింది. ఇక ఇరగవరం, తణుకు, అత్తిలి మండలాల్లో మొత్తం 55 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 44 ఎంపీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 5 స్థానాలకే పరిమితం కాగా.. జనసేన పార్టీ 6 స్థానాలను కైవసం చేసుకుంది. అనేక గ్రామాల్లో టీడీపీని వెనక్కు నెట్టి 2వ స్థానంలో నిలిచింది. మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి సొంత గ్రామమైన వేల్పూరులో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం ఆరింటికి.. ఆరు ఎంపీటీసీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. సొంత ఊరిలో ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలిపించుకోలేని అరిమిల్లి.. ఎమ్మెల్యే సీటుకు పోటీ పడటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. "ఉట్టికి ఎగరలేనమ్మ .. స్వర్గానికి ఎగిరిందన్న సామెత" చందంగా అరిమిల్లి పొజిషన్ ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.
తణుకు నుంచి పోటీకి జనసేన సిద్ధం..
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల బట్టి చూసినా.. మారుతున్న జనం మైండ్ సెట్ బట్టి చూసినా తణుకులో టీడీపీ కన్నా.. తమ పార్టీకే ఆదరణ ఉందని జనసైనికులు చెబుతున్నారు. అధికార వైసీపీని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని.. ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తణుకు అసెంబ్లీ నుంచి ఈసారి జనసేన పార్టీ అభ్యర్ధినే బరిలో నిలపాలనే డిమాండ్ ఆ పార్టీలో బలంగా వ్యక్తం అవుతోంది. ఒకవేళ తమ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. అరిమిల్లి రాధాకృష్ణ స్వచ్చందంగా తమకు సహకరించాలని జన సైనికులు కోరుతున్నారు. తమ దారికి అడ్డు వస్తే.. అరిమిల్లికి భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook