విభజన చట్టంలో భాగంగా తెలియజేసిన హామీల్లో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న విశాఖపట్నం రైల్వేజోన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం కనబరుస్తున్న వైఖరి ఆశాజనకంగా లేదని తెలుపుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడు దీక్షకు కూర్చున్నారు. విశాఖకు రైల్వేజోన్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం రోడ్డు రైల్వేలైన్‌లో బైఠాయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు దీక్షకు కూర్చున్న ఆయన రేపు ఉదయం 7 గంటల వరకు దానిని కొనసాగించనున్నారు. "సాధన దీక్ష" పేరుతో సాగుతున్న ఈ దీక్షను ఆయన ఆముదాలవలస రైల్వేస్టేషనులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్బుక్ లైవ్ కూడా చేసి తన మద్దతుదారులతో మాట్లాడారు. తాను ప్రజల పక్షాన నిలిచి ఈ దీక్షను చేపట్టానని.. ప్రజల హక్కుల సాధన కోసం ఈ ఉద్యమ దిశగా వెళ్తున్నానని ఆయన అన్నారు. రామ్మోహన నాయుడు గతంలో కూడా లోక్‌సభలో రైల్వేజోన్ విషయమై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు.


రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు కావస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు కాబట్టే ఈ బిల్లును పెట్టామని ఆయన అప్పట్లో స్పష్టం చేశారు. రైల్వే చట్టం 1989 సవరించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని బిల్లులో ఆయన పేర్కొన్నారు. 16వ లోక్ సభకు శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆయన లోక్‌సభలో హోమ్‌అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక మరియు సంస్కృతి మంత్రిత్వ శాఖ, అధికార భాష మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిటీలలో కూడా సభ్యులుగా ఉన్నారు.