హైదరాబాద్: తెలంగాణలో 2014 ముందు వరకు టీడీపికి పెద్ద దిక్కుగా వున్న నేతలు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరడంతోనే ఆ పార్టీకి చిక్కులు మొదలయ్యాయనుకుంటే, ఆ తర్వాత మిగిలిన నేతలు కూడా బీజేపి వైపు చూస్తున్నారనే టాక్ టీడీపికి ఇంకొంత ఇబ్బందికరంగా మారనుంది. బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా నేడు హైదరాబాద్‌కి రానున్నారు. టీడీపి నుంచి చాలా మంది నేతలు వారి వారి అనుచరగణం, కార్యకర్తలను జేపి నడ్డా ముఖ్య అతిథిగా జరగనున్న బహిరంగ సభకు తీసుకుని వెళ్లి బీజేపిలో చేరనున్నారని సమాచారం. 


రెండు రోజుల క్రితం తెలంగాణలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా వున్న కే లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపి ఖాళీ అవబోతోందని, తెలంగాణలో ఇప్పటివరకు ఆ పార్టీలో కొనసాగుతున్న నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే టీడీపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మొవ్వా సత్యనారాయణ ఇవాళ బీజేపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బీజేపిలోకి వెళ్తూ వెళ్తూ.. గ్రేటర్ హైదరాబాద్‌ టీడీపీలో వున్న తన అనుచరగణాన్ని, తోటి నాయకులను చాలామందిని కార్యకర్తలతో తనతో సహా బీజేపిలోకి తీసుకువెళ్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఒకవేళ అదే కానీ జరిగితే గ్రేటర్ టీడీపీకి గ్రేట్ షాక్ తప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది.