Telugudesam Seniors: ఏపీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్ని కేటాయించింది. ఇందులో భాగంగా ఇవాళ జనసేన 5 మందిని ప్రకటిస్తే..టీడీపీ అదినేత చంద్రబాబు 94 మంది పేర్లు విడుదల చేశారు. కానీ టీడీపీ సీనియర్లు కొంతమందికి జాబితాలో చోటు లేకపోవడం అంతుచిక్కడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీ కూటమిలో చేరిక విషయంపై ఇంకా స్పష్టత రానందున తెలుగుదేశం పార్టీ కేవలం 94 స్థానాలకే జాబితా ప్రకటించింది. జనసేనకు మొత్తం 24 కేటాయించింది. దాంతో మొత్తం 118 మినహాయిస్తే మిగిలిన సీట్లలో 10-12 బీజేపీకు కేటాయించవచ్చు. మరో 45 సీట్లతో తెలుగుదేశం రెండవ జాబితా వెలువడనుంది. అయితే ఇవాళ విడుదల చేసిన తొలి జాబితాలో టీడీపీ సీనియర్లు కొంతమందికి చోటు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.


సీనియర్లలో ఒకరిద్దరి స్థానాలు మినహాయించి మిగిలిన స్థానాల్లో ఎలాంటి సందిగ్దత గానీ, పొత్తు వివాదం లేదా సంక్లిష్టత లేవు. అలాంటప్పుడు ఆ స్థానాన్ని ఆశిస్తున్న తెలుగుదేశం సీనియర్లకు ఎందుకు స్థానం కల్పించలేదనేది ప్రధాన ప్రశ్న. టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు పేరు జాబితాలో లేదు. బీజేపీతో పొత్తు కుదిరితే ఆయన గతంలో పోటీ చేసిన విశాఖ నార్త్‌ను బీజేపీకు కేటాయించవచ్చు. గంటా కోరుతున్న భీమిలి నియోజకవర్గం ఆయనకు దక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. 


ఇక రాజమండ్రి రూరల్ స్థానం నుంచి జనసేన వర్సెస్ తెలుగుదేశం మధ్య సందిగ్దత ఉంది. రాజమండ్రి రూరల్ జనసేనకు ఖరారైనట్టు పార్టీ నేతలు చెబుతున్నా పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకటించిన ఐదుగురిలో రాజమండ్రి రూరల్ లేదు. దాంతో ఈ స్థానంపై టీడీపీ వర్సెస్ జనసేన మధ్య పోటీ ఉంది. 


ఇక ఎలాంటి వివాదం లేని దెందులూరు, మైలవరం స్థానాల్లో టీడీపీ సీనియర్లకు ఎందుకు స్థానం దక్కలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దెందులూరు నుంచి టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్, మైలవరం నుంచి దేవినేని ఉమ బరిలో ఉండాల్సి ఉంది. కానీ తొలి జాబితాలో ఈ ఇద్దరికి స్థానం దక్కలేదు. మైలవరం స్థానంలో దేవినేని ఉమను పక్కనబెట్టి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కిృష్ణప్రసాద్‌కు కేటాయించవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే దేవినేని ఉమ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. దేవినేని ఉమను పెనమలూరుకు పంపిద్దామనుకున్నా..ఆక్కడి సీటు తనదేంటూ బోడే ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. 


ఇక పల్నాడు జిల్లా నుంచి యరపతినేనికి సీటు దక్కలేదు. అటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆనం రాంనారాయణ రెడ్డికి ఇంకా సీటు కేటాయించలేదు. నెల్లూరు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి పేరు కూడా తొలి జాబితాలో లేకపోవడం గమనార్హం. వైసీపీకు రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరిన తరువాతే సోమిరెడ్డి భవితవ్యం తేలవచ్చు. 


Also read: Janasena-Tdp List: జనసేన-తెలుగుదేశం ఉమ్మడి జాబితా విడుదల, జనసేనకు 24 స్థానాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook