అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మూర్ఖత్వం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని, రాజధానిని విశాఖపట్నానికి తరలించాలని జగన్ ఒక్కడే నిర్ణయం తీసుకుంటే సరిపోదని.. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజలను సీఎం వైఎస్ జగన్ గొర్రెలుగా భావిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు నిజంగానే గొర్రెలు కాకపోతే వైఎస్సార్ సీపీకి 151 సీట్లు ఎలా ఇస్తారని జేసీ ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలంటూ మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి జేసీ దివాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలోగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ఏపీ సీఎం కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కేవలం ఏడు నెలలపాలనకే ఏపీ ప్రజల విశ్వాసాన్ని జగన్ కోల్పోయారని పేర్కొన్నారు. జగన్ పాలన వల్ల పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్తున్నాయని మండిపడ్డారు. ఓ మనిషికి తల ఎంత ముఖ్యమో రాష్ట్ర రాజధానికి సచివాలయం, శాసనసభలు కూడా అంతే ముఖ్యమన్నారు. 


రాజధాని అమరావతిలో కేవలం కమ్మవాళ్లు మాత్రమే భూములు కొనుగోలు చేయలేదని, ఇతర సామాజికవార్గాల వారు కూడా కొన్నారని చెప్పారు. గత ఏడు నెలలుగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైజాగ్‌లో తిష్టవేసి, భూముల కొనుగోలు చేయడం నిజం కాదా అని జేసీ ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఆర్థిక సాయం చేశారని నేడు మన రక్తాన్ని పీల్చి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రెట్టింపు చెల్లించుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..