కేరళలో రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సగం కేరళ వరదల్లో చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది అక్కడి ప్రభుత్వం. కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాలు సాయం అందిస్తున్నాయి.  పలువురు సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ వరదలతో అల్లాడుతున్న కేరళకు ఆదుకొనేందుకు తన వంతుగా 5 లక్షల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు తన అభిమానులు విరాళాలు అందించాలంటూ.. 'రౌడీస్.. మనమిచ్చే చిన్న చిన్న మొత్తాలు.. కేరళ ప్రజల జీవితాలను మారుస్తాయి. నాతో పాటు మీరూ రండి' అంటూ ట్వీట్ చేశారు. కాగా కేరళకు సాయం అందించిన తొలి టాలీవుడ్ హీరో విజయ్ కావడం విశేషం.  



 


కేరళకు సాయం చేసేందుకు తమిళనాడు ముందుకొచ్చింది. తమిళనాడు ప్రభుత్వం 5 కోట్లు, సినీ నటులు కమల్‌ రూ.25 లక్షలు, సూర్య, కార్తీలు కలిపి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు. మరో పక్క విశాల్‌.. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ వాసులను ఆదుకుందామని, కష్టసమయంలో ఉన్న వాళ్లకి అండగా ఉందామని అభిమానులకు పిలుపునిస్తూ..విరాళాలు సేకరిస్తున్నట్టు ప్రకటించారు. అటు కేరళ సర్కారుకు తగినన్ని సహాయనిధులు కేటాయించాలని ప్రధానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ లేఖ రాశారు.