Mulayam Singh Yadav:  కాకలుతీరిన రాజకీయ యోధుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత దేశంలో విషాదం నింపింది. సామాన్య కుటుంబం నుంచి అంచెలంచులుగా ఎదిగి 6 దశాబ్దాల పాటు రాజకీయ ప్రస్థానం కొనసాగించారు ములాయం సింగ్ యాదవ్. ఆయన రాజకీయ జీవితం ఎంతో ఆదర్శనీయం. సాధారణ యాదవ కుల కుటుంబంలో ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లా సేఫయీ  అనే పల్లెటూర్లో 1939 నవంబరు 22న జన్మించారు ములాయం సింగ్ యాదవ్. ములాయం తండ్రికి ఐదుగురు కుమారులు, ఒక కూతురు. ములాయం మూడో సంతానం. తండ్రి ప్రోత్సాహంతో సమీపంలోని పట్టణంలో  డిగ్రీ పూర్తి చేశారు. టీచర్ కావాలనే కోరికతో బీఈడీ చదివాడు.చిన్నప్పటి నుంచి కుస్తీ పోటీలో పాల్గొనే ములాయం మల్లయోధుడుగా గుర్తింపు పొందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాధమిక విద్యా దశలోనే లీడర్ షిప్ లక్షణాలు కలిగిఉన్న ములాయం సింగ్ యాదవ్.. 14 ఏళ్ళ వయసులోనే  1953లో వ్యవసాయ నీటి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా  సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. నెల రోజులు జైల్లో ఉన్నారు. అలా రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ములాయం.. 1967లో 27 ఏళ్ళ వయసులో తన స్వంత నియోజకవర్గం జశ్వంత్ పూర్  నుంచి తొలి సారి అసెంబ్లీకి సోషలిస్టు పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అప్పడు యూపీ అసెంబ్లీకి ఎన్నికయిన వారిలో ములాయందే చిన్న వయసు. ఇప్పటి వరకు 18 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో 11 సార్లు అసెంబ్లీ, ఏడు సార్లు లోక్ సభకు పోటీ చేశారు. 16 సార్లు గెలిచారు. 1969,1980లో జశ్వంత్ పూర్  నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఏడు సార్లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ములాయం.. ఏనాడు ఓడిపోలేదు. ప్రస్తుతం ములాయం తన స్వగ్రామం ఉన్న మైనాపురి లోక్ సభ ఎంపీగా కొనసాగుతున్నారు.


సోషలిస్టు సిద్ధాంతాన్ని పాటించారు ములాయం సింగ్ యాదవ్. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కడా మతతత్వ పార్టీ వైపు మళ్లలేదు. 1967లో గురువు లోహియా మరణంతో సోషలిస్టు పార్టీ చీలిపోయింది. ఆ తర్వాత దేశ ప్రధానిగా పని చేసిన చౌదరీ చరణ్ సింగ్ నాయకత్వంలో ములాయం పని చేశారు. చరణ్ సింగ్ పార్టీ భారతీయ లోక్ దళ్ తో పాటు మరికొన్ని పార్టీలతో కలిసి 1977లో ఇందిరాగాంధీని ఓడించడానికి జనతా పార్టీగా ఏకమైంది. 1977లో దేశంలో   పాటు యూపీలో కూడా రాంనరేష్ యాదవ్ నాయకత్వంలో జనతా పార్టీ విజయం సాధించింది. రామ్ నరేష్ యాదవ్ ప్రభుత్వంలో ములాయంకు సహకార శాఖ మంత్రి పదవి వరించింది. 1980లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇందిర రద్దు చేసింది. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో ములాయం ఓడిపోయారు. ఇది ఆయనకు రెండో ఓటమి. తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో గెలిచి.. శాసనమండలిలో  లోక్ దళ్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అప్పటి అధికార పార్టీని సభలో ముప్పు తిప్పలు పెట్టారు. 1985 యూపి అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలిచాడు. ఈసారి 425  స్థానాలున్న  అసెంబ్లీకి  లోక్ దళ్ పార్టీ నుండి  86 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ లో లోక్ దళ్  ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా ములాయం ఎన్నికై ఆ అసెంబ్లీ కాలమంతా అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నాయకుడుగా గుర్తింపు పొందారు.


బోఫోర్స్ ఉదంతంతో  1989లో ప్రధాని రాజీవ్ ను ఓడించడానికి నాలుగు పార్టీల కలయికతో ఏర్పడిన జనతాదళ్ లో ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ దళ్ కూడా విలీనం అయ్యింది. లోక్ సభ, అసెంబ్లీ కి 89లో ఏక కాలంలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ కేంద్రంలోను  ఇటు యూపి.లో విజయం సాధించింది. ములాయం ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఏర్పడ్డానికి అవసరమైన మెజారిటీ లేదు. కమ్యూనిస్టుల మద్దతుతో ములాయం సింగ్ యాదవ్ 24 కోట్ల జనాభాతో దేశంలో అతిపెద్ద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. జనతాదళ్ ప్రభుత్వం  మండల్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని  నిర్ణయించడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజేపి ఆందోళన అనంతర పరిణామాల మధ్య బీజేపీ తన  ఎంపీల మద్దతు ఉపసంహరించుకోవటంతో అటు కేంద్రంలో ఇటు యుూపిలో ప్రభుత్వాలు పడిపోయాయి. తర్వాత  1993లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మద్దతుతో ములాయం రెండో సారి ముఖ్యమంత్రి అయ్యారు.   


1996లో ములాయం మొదటి సారి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి గత 2019 ఎన్నికల వరకు జరిగిన అన్ని లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి వరుసగా విజయం సాధించారు ములాయం సింగ్ యాదవ్.
1996లో కేంద్రంలో ఏర్పడిన యునైటెడ్  ఫ్రంట్ ప్రభుత్వంలో ములాయం కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రధాన మంత్రి పదవి ములాయం సింగ్ కు వచ్చినట్లే వచ్చి చేజారిందని అంటారు. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవగౌడ ప్రధాని పదవికి   రాజీనామా చేసిన సందర్భంలో ములాయం ప్రధాని అవుతారని అంతా భావించారు. అయితే చివరలో ములాయంకు బదులుగా ఏకే గుజ్రాల్ పేరు తెరపైకి వచ్చింది. కొందరు నేతల కుట్రలతోనే ములాయం దేశ ప్రధాని కాలేకపోయారని  ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాజీ సంపాదకుడు శేఖర్ గుప్తా 2012 సెప్టెంబర్ నెలలో రాసిన కాలమ్ లో వివరించారు.


Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు అరెస్ట్..  నెక్స్ట్ ఎవరో?


Also Read: మాథ్యూ వేడ్‌ పెద్ద చీటర్.. క్రికెట్ నుంచి ఆస్ట్రేలియాను బ్యాన్ చేసేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook