న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్‌లోని పలువురు కీలక మంత్రులకు కీలక శాఖలు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేశారు. అందరూ ఊహించినట్టుగానే అమిత్ షాకు కేంద్ర హోంశాఖ, రాజ్‌నాథ్ సింగ్‌కి రక్షణ శాఖ, నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుబ్రహ్మణ్యన్ జైశంకర్‌కి విదేశాంగ శాఖ కేటాయించారు. మహిళా మరియు శిశు సంరక్షణ శాఖ బాధ్యతలను స్మృతి ఇరానికి అప్పగించారు. ఈసారి కొత్తగా కేబినెట్‌లోకి వచ్చిన అమిత్ షాకు కీలకమైన హోంశాఖ దక్కగా గత కేబినెట్‌లో నిర్మలా సీతారామన్ మంత్రిగా వ్యవహరించిన రక్షణ శాఖను రాజ్‌నాథ్ సింగ్‌కి అప్పగించారు. రాజ్‌నాథ్ సింగ్ గత కేబినెట్‌లో కేంద్ర హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.


నేడే తొలి భేటీకి సిద్ధమవుతోన్న నరేంద్ర మోదీ కేబినెట్


గత కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా వున్న అరుణ్ జైట్లీ ఈసారి అనారోగ్య కారణాలరీత్యా మంత్రి పదవికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రధానికి లేఖ రాసిన నేపథ్యంలో ఆర్థిక శాఖను ఈసారి నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు.