న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన భారీ వేదికపై రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అదే వేదికపై ఏర్పడిన తొలి కేబినెట్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు తొలిసారి సమావేశం కానుంది. 2014లో భారతీయ జనతా పార్టీ పగ్గాలు చేపట్టిన అమిత్ షా 2019 లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించిన నేపథ్యంలో ఈసారి కేబినెట్‌లో ఆయనకు కచ్చితంగా చోటు దక్కుతుందని ఆశించినట్టుగానే అమిత్ షాను మోదీ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జై శంకర్‌కి అనూహ్యంగా కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది.
గత కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన సుష్మా స్వరాజ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, మేనకా గాంధీ వంటి వారికి మోదీ నూతన కేబినెట్‌లో చోటు దక్కకపోవడం గమనార్హం. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, అందువల్ల తనకు ఈసారి కేబినెట్‌లో అవకాశం కల్పించకూడదని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని మోదీకి మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారమే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను మోదీ తన కేబినెట్ లోకి తీసుకోలేదని తెలుస్తోంది.