Encounter Specialist: గ్యాంగ్‌స్టర్స్‌ను గడగడలాడించిన లెజెండరీ ఐపీఎస్ ఏఏ ఖాన్ కన్నుమూత..
Encounter Specialist AA Khan Passes Away: 1963 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఏఏ ఖాన్ 1997లో రిటైర్ అయ్యారు. ఐపీఎస్ అధికారిగా ముంబై, గుజరాత్‌లలో ఎన్నో ఎన్‌కౌంటర్ ఆపరేషన్స్‌ను చేపట్టారు.
Encounter Specialist AA Khan Passes Away: ఒకప్పుడు ముంబైలో గ్యాంగ్‌స్టర్స్‌ను గడగడలాడించిన లెజెండరీ ఐపీఎస్ అధికారి అఫ్తాబ్ అహ్మద్ (AA Khan) శుక్రవారం (జనవరి 21) కన్నుమూశారు. ఆయన వయసు 81 ఏళ్లు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్న ఏఏ ఖాన్.. శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను అంధేరిలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఖాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
1963 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఏఏ ఖాన్ 1997లో రిటైర్ అయ్యారు. ఐపీఎస్ అధికారిగా ముంబై, గుజరాత్‌లలో ఎన్నో ఎన్‌కౌంటర్ ఆపరేషన్స్‌ను చేపట్టారు. ముఖ్యంగా 1991లో ముంబైలోని స్వాతి బిల్డింగ్‌లో గ్యాంగ్‌స్టర్ మయా డోలస్ ఎన్‌కౌంటర్, అదే ఏడాది గుజరాత్‌లోని వడోదరాలో 'ఆపరేషన్ బరోడా' ఎన్‌కౌంటర్‌లతో ఏఏ ఖాన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.
స్వాతి బిల్డింగ్ ఎన్‌కౌంటర్ :
ఏఏ ఖాన్ మృతిపై 1990'ల్లో ఆయన టీమ్‌తో కలిసి పనిచేసిన రిటైర్డ్ ఏసీపీ ఇక్బాల్ షేక్ స్పందించారు. 'ఆయనొక ఫైర్ బ్రాండ్ ఆఫీసర్. ఏ ఆపరేషన్ అయినా టీమ్‌ను ముందుండి నడిపించేవాడు. టీమ్‌కు ఆర్డర్స్ ఇచ్చి.. ఆయన వెళ్లి ఏసీ రూమ్‌లో రిలాక్స్ అయ్యే రకం కాదాయన.' అని ఇక్బాల్ షేక్ పేర్కొన్నారు. నవంబర్ 16, 1991 ఏఏ ఖాన్ నేత్రుత్వంలో నిర్వహించిన స్వాతి బిల్డింగ్ ఎన్‌కౌంటర్ ఎపిసోడ్‌ను ఈ సందర్భంగా ఇక్బాల్ షేక్ గుర్తుచేసుకున్నారు.
ముంబైలోని లోఖండవాలాలో జరిగిన దాదాపు 100 మంది పోలీస్ టీమ్‌ను లీడ్ చేస్తూ ఖాన్ ఆ ఆపరేషన్ చేపట్టినట్లు ఇక్బాల్ షేక్ తెలిపారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఆ ఆపరేషన్‌లో గ్యాంగ్‌స్టర్స్ మయా డోలస్, దిలీప్ బుహ, మరో ఐదుగురు క్రిమినల్స్ హతమైనట్లు తెలిపారు. ఇదే ఎన్‌కౌంటర్ ఎపిసోడ్‌పై బాలీవుడ్‌లో 'షూటవుట్ ఎట్ లోఖండవాలా' అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఐపీఎస్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్ నటించారు.
ఆపరేషన్ బరోడా :
జనవరి 24, 1991న గుజరాత్‌లోని వడోదరాలో ఏఏ ఖాన్ చేపట్టిన 'ఆపరేషన్ బరోడా' ఎన్‌కౌంటర్‌తో అప్పటి ఖలీస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ బల్దియో సింగ్ సైనీ, మరో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. 1992లో ముంబైలోని ములుంద్ ప్రాంతంలో చేపట్టిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అప్పట్లో హర్యానా సీఎంపై కాల్పులు జరిపిన ఉగ్రవాది మన్‌జిత్ సింగ్‌ను ముంబైలోని (Mumbai News) దాదర్ రైల్వే స్టేషన్‌లో ఖాన్ టీమ్ అరెస్ట్ చేసింది. 1990లో ఏఏ ఖాన్ మహారాష్ట్ర ఏటీఎస్‌ను స్థాపించారు. ఇలాంటి సంస్థ దేశంలో ఇదే మొదటిది కావడం విశేషం. అటు ఉగ్రవాదులను, ఇటు మాఫియా గ్యాంగులను గడగడలాడించిన ఖాన్ మృతిపై పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Also Read: IND vs PAK: వారిద్దరూ రాణించకపోతే.. టీమిండియాపై ఒత్తిడి తప్పదు: హఫీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook