రాష్ట్రపతిని హత్య చేస్తారని చెప్పిన పూజారి అరెస్ట్
కేరళ త్రిశూర్‌లోని చిరక్కళ్ భగవతి ఆలయం పూజారి జయరామన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కేరళ త్రిశూర్‌లోని చిరక్కళ్ భగవతి ఆలయం పూజారి జయరామన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను హత్య చేస్తారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించిన నేపథ్యంలో జయరామన్‌ను అరెస్టు చేశారు. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చాక, పోలీసులు బృందంగా ఏర్పడి ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించారు. తర్వాత జయరామన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
త్రిస్సూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ వివరాల ప్రకారం, పోలీసులకు ఫోన్ చేసేటప్పుడు ఆలయ పూజారి మద్యం మత్తులో ఉన్నాడని, స్పృహలోకి వచ్చాక.. మరుసటి రోజువరకు మద్యం మత్తులో ఉన్న అతనికి ఏమీ గుర్తులేదని వివరించారు. రాష్ట్రపతి కేరళ పర్యటన ముగించుకొని వెళ్లేవరకు పూజారిని కస్టడీలో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
కేరళ శాసనసభ యొక్క డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా, 'ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ'ను ప్రారంభించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. మంగళవారం త్రిశూర్‌లోని గురువాయూర్ దేవాలయాన్ని కూడా రాష్ట్రపతి సందర్శించనున్నారు.