PM Narendra Modi: న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే చేపట్టాల్సిన చర్యలపై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 24న మాట్లాడిన సంగతి తెలిసిందే. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ (Covid-19 vaccine) అభివృద్ధి, ఉత్ప‌త్తి చేస్తున్న సంస్థ‌ల‌ను ప్రధాని సందర్శించి శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాని మోదీ అహ్మదాబాద్‌, పుణె, హైదరాబాద్‌లలో పర్యటించనున్నారు. ముందుగా ప్రధాని మోదీ వాయుసేన విమానంలో ఉదయం 9.30 గంటలకు అహ్మ‌దాబాద్‌లోని జైడ‌స్ బ‌యోటెక్ పార్క్ చేరుకుంటారు. ఆ తర్వాత 12.30కి పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు. అనంతరం 3.45 గంటలకు హైద‌రాబాద్‌లోని భార‌త్ బ‌యోటెక్ (Bharat Biotech) సంస్థ‌ను ప్ర‌ధాని మోదీ సందర్శించనున్నారు. ఈ పర్యటనతో వ్యాక్సిన్ పురోగతి, ఉత్పత్తి, సరఫరా ఇందుకు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ గురించి ప్రధాని సమీక్షించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో భాగంగా భారత వాయుసేన ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3.45 గంటలకు శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లిలోని జెనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు చేరుకొని శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ సంభాషించనున్నారు. సాయంత్రం కల్లా పర్యటనను ముగించుకొని మోదీ ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఘన స్వాగతం పలకనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మూడు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. Also read: Covid vaccine: భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం


Also read: Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి