Sputnik v: ఇండియాలో ట్రయల్స్ ప్రారంభించనున్న డాక్టర్ రెడ్డీస్
ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ట్రయల్స్ త్వరలో ఇండియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డీసీజీఐ అనుమతి పొందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ..వందమందిపై పరీక్షలు చేయనుంది.
ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ( Russia vaccine sputnik v ) ట్రయల్స్ త్వరలో ఇండియాలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే డీసీజీఐ అనుమతి పొందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ..వందమందిపై పరీక్షలు చేయనుంది.
కోవిడ్ వ్యాక్సిన్ ( covid19 vaccine ) విషయంలో ఇండియా సన్నద్ధమవుతోంది. ఓ వైపు భారత్ బయోటెక్ ( Bharat Biotech ) కంపెనీ స్వయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుండగా మరో రెండు కంపెనీలు విదేశీ వ్యాక్సిన్ ఉత్పత్రి, సరఫరా ఒప్పందాన్ని చేసుకున్నాయి. అంతేకాకుండా ఆ రెండు విదేశీ వ్యాక్సిన్ ట్రయల్స్ ( Vaccine Trials ) ను ఇండియాలో నిర్వహిస్తున్నాయి. ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెెనెకా ( Oxford - AstraZeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ ఒప్పందం కుదుర్చుకున్న ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum Institute ).. ట్రయల్స్ కూడా ప్రారంభించింది. తరువాత రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తో ఇండియాకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ( Dr Reddy's Labs ) ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ ట్రయల్స్ ను త్వరలో ఇండియాలో ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికోసం డీసీజీఐ ( DCGI ) అనుమతి తీసుకుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వందమంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు చేయనుంది. ఈ పరీక్షలు ఎప్పుడు చేసేది ఇంకా నిర్ణయించలేదు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం చేసుకుంది.
ఒప్పందంలో భాగంగా ప్రయోగాల అనంతరం 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేయడానికి రెడ్డీస్ ల్యాబ్‌కి అనుమతిచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్ వెల్లడించింది. గత నెలలో ఆర్‌డీఐఎఫ్ భారత ప్రభుత్వంతోనూ, ఔషధ కంపెనీలతో స్థానికంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీపై చర్చించింది. అలాగే స్పుత్నిక్–వీ భద్రత, దాని పనితీరుపై మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ది లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కి 100 మందిపై, మూడో దశలో 14 వందల వాలంటీర్లపై ప్రయోగాలు జరుపుతారని అధికారులు వెల్లడించారు.
మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులో వస్తే.నిర్వహించాల్సిన కార్యాచరణను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. స్పెషల్ కోవిడ్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ( Special Covid Immunisation Program ) లో భాగంగా ప్రాధాన్యత వర్గాలకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్రజలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఆశా వర్కర్లు ఉన్నారు. అలాగే 2 కోట్ల మంది మున్సిపల్ కార్మికులు, పోలీసులు, సైనిక సిబ్బంది.. 26 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 50 ఏళ్లలోపు వయసుండి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మొదటి దశలోనే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక ఇండియాలో ఇప్పటివరకూ కరోనా వైరస్ కేసుల సంఖ్య. 77 లక్షలు దాటేసింది. ప్రతిరోజూ 50-60 వేల కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. డిసెంబర్ నాటికి కోటి దాటుతుందనే అంచనాలున్నాయి. గత 24 గంటల్లో 54 వేల కొత్త కేసులు బయటపడ్డాయి. అటు 690 మంది దేశవ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో మరణించారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1 లక్షా 17 వేల 306కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 6 లక్షల 95 వేల 509 యాక్టివ్ కేసులున్నాయి. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ