బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి జీ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన ఆలోచనలు పంచుకున్నారు. మహాకూటమి పేరుతో ఇతర పార్టీలు చేసే ప్రయోగాలను తమ పార్టీ కచ్చితంగా ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు. తమ రాష్ట్ర పరిస్థితులనే సరిదిద్దుకోలేని ఆయా పార్టీల నేతలందరూ కలిసి మోదీని ఎదుర్కోవడమంటే మాటలు కాదని.. అది అయ్యే పనిలా తనకు కనిపించడం లేదని ఆయన అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రభావం రాజస్థాన్ ఎన్నికల మీద ఎలా పడదో.. రాజస్థాన్ ఎన్నికల ప్రభావం కూడా ఇతర రాష్ట్రాల మీద పడే అవకాశం ఉండదని అమిత్ షా తెలిపారు. దేశ రాజకీయాలు వేరు.. రాష్ట్ర రాజకీయాలు వేరని ఆయన ఉద్ఘాటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎలాంటి కూటములు వచ్చినా సరే.. బీజేపీని ఎదుర్కోవడమంటే కత్తి మీద సాము లాంటి పనే అని అమిత్ షా అన్నారు.  జీన్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరితో జరిగిన చర్చా కార్యక్రమంలో అమిత్ షా.. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.  1+1+1 మొత్తాన్ని కూడితే 3 మాత్రమే అవుతుంది తప్పితే.. 111 కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు.   


పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం బీజేపీ 23 సీట్లను గెలుచుకుంటుందని అమిత్ షా తెలిపారు. అలాగే రాజస్థాన్‌లో కూడా బీజేపీ ప్రభావవంతమైన ఫలితాలు ఇస్తుందన్న ఆయన... గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ విషయంలో గతంలో తాము అవలంబించిన విధానాలు ఈ సారి మిగతా రాష్ట్రాలలో కూడా అవలంబిస్తామని అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో అమిత్ షా రాఫెల్ డీల్ గురించి కూడా తన అభిప్రాయాలు పంచుకున్నారు. కాంగ్రెస్ చెబుతున్న అంశాల్లో నిజాలు లేవని.. సుప్రీంకోర్టు అడిగిన సాక్ష్యాలన్నీ కూడా తాము అందించామని అన్నారు. కోర్టు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 


అలాగే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం విషయంపై కూడా అమిత్ షా మాట్లాడారు. ఈ విషయం సుప్రీంకోర్టులో ఉందని.. ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం లేదని... రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రామ మందిర సమస్య పరిష్కారమవుతుందని షా తెలిపారు. ఈ సమస్య ప్రభావం ఎన్నికలపై ఉండదన్నారు. 2018 కచ్చితంగా బీజేపీ పార్టీయే గెలుస్తుందని ఆయన నిశ్చయాభిప్రాయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో అక్రమంగా దేశంలోకి చొచ్చుకొస్తున్న  ఇమ్మిగ్రెంట్స్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. బీజేపీ మాత్రమే ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిదని అమిత్ షా అన్నారు. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ ప్రభావం కనిపిస్తుందని.. పీడీపీ లాంటి పార్టీలు  జనాలను పక్కదారి పట్టించాలని చూస్తున్నా.. వారికి బీజేపీ పట్ల నమ్మకం ఉందని.. అదే నమ్మకం తమను గెలిపిస్తుందని షా అభిప్రాయపడ్డారు.