ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) భారీ విజయాన్ని అందుకుంది. పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై విజయాన్ని సాధించి కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు సన్‌రైజర్స్ మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు మరోసారి సత్తా చాటింది. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన 45వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 88 పరుగుల తేడా (IPL 2020: SRH beat DC by 88 Runs)తో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 



 


సన్‌రైజర్స్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీసీ జట్టు 19 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌటైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్‌ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలకు తోడు మనీశ్‌ పాండే (31 బంతుల్లో 44 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మరో కీలక మ్యాచ్‌లో రాణించడంతో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.



 


220 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన డీసీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అద్బుత ఫామ్‌లో ఉన్న డీసీ ఓపెనర్ శిఖర్ ధావన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆపై స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.  ఓపెనర్‌ రహానే (26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), పంత్‌ (35 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరవాలేదనిపించారు. రషీద్‌ ఖాన్‌ (3/7)కు తోడు సందీప్ శర్మ, నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టడంతో 19 ఓవర్లలో 131 పరుగులకే ఢిల్లీ ఆలౌట్ కావడంతో 88 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని అందుకుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe