రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భుజానికి గాయమైంది. అయితే బెంగళూరులో ఆదివారం (జనవరి 19న) జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో రోహిత్ ఆడతాడా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. కీలక ఆటగాడు రోహిత్ లేకపోతే జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని అంతా భావించారు. కానీ మూడో వన్డేలో రోహిత్ ఆడతాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ధోనీని అధిగమించిన కేఎల్ రాహుల్


మ్యాచ్ తర్వాత రోహిత్‌తో మాట్లాడినట్లు కోహ్లీ చెప్పాడు. గాయం గురించి అడిగితే ఎడమ భుజానికి  స్వల్ప గాయమైందని, పెద్ద సమస్యేమీ కాదని రోహిత్ చెప్పినట్లు తెలిపాడు. కొద్దిసేపు నొప్పి కలిగిందని, ప్రస్తుతం రోహిత్ బాగానే ఉన్నాడని.. మూడో వన్డేలో అతడు కచ్చితంగా ఆడతాడని వెల్లడించాడు. కాగా, రాజ్‌కోట్ వన్డేలో 43వ ఓవర్లో స్వీపర్ కవర్ వైపు నుంచి పరుగెత్తుతూ వచ్చిన రోహిత్ బంతి బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో గాయపడ్డాడు. బంతిని త్రో వేయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.


ఫిజియో నితిన్ పటేల్ సహాయంతో బయటకు వెళ్లాడు. రోహిత్ స్థానంలో కేదార్ జాదవ్ ఫీల్డింగ్ చేశాడు. గతేడాది ఐపీఎల్ సమయంలోనూ భుజం నొప్పితో  బాధపడ్డ రోహిత్ తిరిగి రెండ్రోజుల్లో ఫిట్‌నెస్‌ సాధించి ఆట మొదలుపెట్టాడు. అయితే రోహిత్ మూడో వన్డేలో ఆడతాడా లేదా అన్నది ఆదివారం మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయం తీసుకోనున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడు చెప్పారు.


కాగా, తొలి వన్డేలో దారుణ వైఫల్యాన్ని మూటకట్టుకున్న భారత్.. రాజ్ కోట్ వన్డేలో సత్తా చాటింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డేకు బెంగళూరు వేదికకానుంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే కచ్చితంగా మూడో వన్డేలో నెగ్గి తీరాలని ఆతిథ్య భారత్‌తో పర్యటక ఆస్ట్రేలియా భావిస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..