IND vs WI 2nd ODI: విండీస్‌పై 107 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. విశాఖ స్టేడియంలోనూ ఓ రికార్డు
విశాఖపట్నంలోని డా వైఎస్సార్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ACA-VDCA stadium)లో బుధవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా విండీస్‌పై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను కోహ్లీ సేన 1-1తో సమం చేసింది.
విశాఖ : విశాఖపట్నంలోని డా వైఎస్సార్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ACA-VDCA stadium)లో బుధవారం జరిగిన రెండో వన్డేలో విండీస్‌పై టీమిండియా 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్‌తో తొలి వన్డేలో ఓటమి ప్రతీకారాన్ని తీర్చుకోవడంతో పాటు 3 వన్డేల సిరీస్‌ను కూడా కోహ్లీ సేన 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ ( 159 పరుగులు; 138 బంతుల్లో 17x4, 5x6), లోకేష్ రాహుల్ ( 102 పరుగులు; 104 బంతుల్లో 8x4, 3x6)లు 'శత'క్కొట్టారు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి దిగిన శ్రేయాస్ అయ్యర్ (53 పరుగులు; 32 బంతుల్లో 3x4, 4x6), రిషబ్‌పంత్ ( 39 పరుగులు; 16 బంతుల్లో 3x4, 4x6)లు కూడా ధీటుగా ఆడి భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం అభిమానులను ఒకింత నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ ఔట్ అయిన కొద్దిసేపటికే కోహ్లీ సైతం పొలార్డ్ బౌలింగ్‌లో రోస్టన్ చేస్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
అనంతరం 388 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకే ఆలౌటైంది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ షాయ్ హోప్ (78 పరుగులు, 85 బంతుల్లో 7x4, 3x6), నికోలస్ పూరన్ (75 పరుగులు; 47 బంతుల్లో 6x4, 6x6) 75 పరుగులు, కీమో పాల్ 46 పరుగులతో రాణించినప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో 43.3 ఓవర్లలోనే విండీస్ సేన కుప్పకూలింది. భారత బౌలరల్లో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్‌తో మెరవగా, మహ్మద్ షమీ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.
విశాఖ స్టేడియంలో మరో రికార్డు..
విశాఖపట్నంలోని ఏసిఏ-వీడిసిఏ స్టేడియంలో ఒక జట్టు తన ప్రత్యర్థికి 388 పరుగుల విజయ లక్ష్యం నిర్ధేశించడం ఇదే తొలిసారి. 2005లో పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఇప్పటివరకు విశాఖ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్ కాగా తాజాగా టీమిండియా మరోసారి తన రికార్డుని తనే అధిగమించి మరో కొత్త రికార్డు సృష్టించింది.