IND vs WI ODI 1st match| చెలరేగిన హెట్మెయిర్, హోప్.. విండీస్ ఘన విజయం

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో ఘోరపరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287/8 పరుగులు చేయగా.. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్ల నష్టానికే విజయాన్ని సాధించింది.

Last Updated : Dec 16, 2019, 12:13 AM IST
IND vs WI ODI 1st match| చెలరేగిన హెట్మెయిర్, హోప్.. విండీస్ ఘన విజయం

చెన్నై: వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో ఘోరపరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 287/8 పరుగులు చేయగా.. 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్ల నష్టానికే విజయాన్ని సాధించింది. విండీస్ జట్టు లక్ష్య ఛేదనలో ఆరంభంలో కేవలం 11 పరుగులకే ఓపెనర్ సునీల్ అంబ్రెస్ రూపంలో తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత షాయ్‌ హోప్‌-హెట్‌‌మెయిర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నిలబెడుతూ స్టేడియం నలువైపులా షాట్లు బాది భారీ స్కోర్ రాబట్టారు. హెట్మెయిర్(139 పరుగులు 7X6, 11x4) రెచ్చిపోయి ఆడుతున్న తరుణంలో 39వ ఓవర్‌లో మొహ్మద్ షమి వేసిన బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించి మిడ్ వికెట్ వద్ద శ్రేయాస్ అయ్యర్ చేతికి చిక్కడంతో అతడి టెర్రిఫిక్ ఇన్నింగ్స్‌కి తెరపడినట్టయింది. అలా రెండో వికెట్‌కు హెట్మెయిర్, షాయ్ హోప్ ఇద్దరూ కలిసి 201 బంతుల్లో 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

హెట్మెయిర్ ఔట్ అయిన అనంతరం కూడా షాయ్ హోప్(149 బంతుల్లో 102 పరుగులు) తన దాడిని కొనసాగించడంతో విండీస్ జట్టు సునాయసంగానే టీమిండియాపై విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో శివం దూబే అత్యధికంగా 7.5 ఓవర్లలో 68 పరుగులు సమర్పించుకోగా, మహ్మద్ షమీ సైతం 9 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చి విండీస్ విజయానికి పరోక్షంగా బాటలు వేశారు.

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విషయానికొస్తే.. ఓపెనర్ కేఎల్ రాహుల్ కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే పెవిలియన్ బాటపట్టగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) కూడా అంతే త్వరగా వెనుతిరిగాడు. రోహిత్ శర్మ (36) కుదురుకుని పరుగులు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ జోసెఫ్ బౌలింగ్ అతడిని ఔట్ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత క్రీజోలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(88 బంతుల్లో 70 పరుగులు), రిషబ్ పంత్(69 బంతుల్లో 71 పరుగులు) ఇద్దరూ అర్ధ శతకాలతో ఇన్నింగ్స్‌ని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోనే జోసెఫ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌ షాట్‌కి ప్రయత్నించి పొలార్డ్‌ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పొలార్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రిషబ్ పంత్.. హెట్మెయిర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 

పంత్ ఔట్ అయిన తర్వాత వచ్చిన కేదార్ జాదవ్(40), రవీంద్ర జడేజా(21) చివరి పది ఓవర్లలో 72 పరుగులు జోడించారు. ఫలితంగా టీమిండియా ఒక విధంగా గౌరవప్రదమైన స్కోరు చేసినప్పటికీ... హెట్‌‌మెయిర్‌, షాయ్‌ హోప్‌ చెలరేగి ఆడటంతో విజయం విండీస్ వశమైంది.

Trending News