Virat Kohli`s test rank | మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్.. ఆ తర్వాత ఎవరో తెలుసా ?
టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాక్సింగ్స్‌లో మరోసారి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 928 పాయింట్లతో ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన టాప్ ర్యాంకును పదిలపర్చుకున్నాడు.
న్యూఢిల్లీ: టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాక్సింగ్స్‌లో(ICC test rankings) మరోసారి నెంబర్ 1 స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. కోహ్లీ 928 పాయింట్లతో ముందుండగా ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గతవారం విరాట్ కోహ్లీకి స్టీవ్ స్మిత్‌కు మధ్య 5 పాయింట్లు మాత్రమే తేడా ఉండగా ప్రస్తుతం ఆ దూరం 17 పాయింట్లకు పెరిగింది. ఇక గత వారం 877 పాయింట్స్‌తో 3వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అదే స్థానంలో కొనసాగుతున్నప్పటికీ... పాయింట్స్ పట్టికలో అతడు 13 పాయింట్స్ కోల్పోయి 864 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 791 పాయింట్లతో చటేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, ఆసీస్ బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ 786 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు 731 పాయింట్స్‌తో 8వ స్థానంలో ఉన్న అదే లబుషెన్.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసి ఏకంగా టాప్-5 జాబితాలోకి దూసుకొచ్చాడు. అలాగే పాక్ ఆటగాడు బాబర్ ఆజం సైతం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని ఏకంగా 9వ స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు టీ20ల్లో టాప్ ర్యాంకర్ అయిన బాబర్ ఆజం.. తొలిసారిగా టెస్టుల్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
ఇక టెస్టుల్లో బౌలర్స్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆసీస్ ఆటగాడు పాట్ కమిన్స్ 898 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 839 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కివీస్ బౌలర్ నీల్ వానెర్ (834), విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ (830), ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (806)లు వరుసగా ఆ తర్వాతి స్థానాలు సొంతం చేసుకున్నారు.