Bandi Sanjay: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్‌కి బండి సంజయ్ సూటి ప్రశ్నలు
Bandi Sanjay to CM KCR : తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయన్నే నేరుగా కలిసి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
Bandi Sanjay Press meet: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదన్న ఆయన.. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కారణంగానే తాము హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని బండి సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రామగుండం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వం. ఈ కుట్ర మరెక్కడో కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ కలిసి రాకపోవడానికి కారణమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్వాగతం పలకాలనే సంస్కారం కూడా లేని మనిషి కేసీఆర్. ఒకసారి కోవిడ్ అంటడు. ఇంకోసారి జ్వరం అంటడు.. మరోసారి ఢిల్లీ అంటడు. ఏదో ఒక సాకులు చెబుతూ ప్రోటోకాల్ పాటించని మూర్ఖుడు కేసీఆర్ అని విరుచుకుపడ్డారు.
తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్... అదే నిజమైతే ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయన్నే నేరుగా కలిసి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. నిజంగా కేంద్రం అన్యాయమే చేసినట్టయితే.. రాష్ట్ర ప్రజల సమస్యలను చెప్పుకోవడానికైనా ప్రధాని మోదీ పర్యటనను వేదికగా చేసుకోవచ్చు కదా అన్నారు. అయినప్పటికీ ప్రధాని మోదీ ముందుకు కేసీఆర్ రావడం లేదంటే.. ప్రధానికి ముఖం చూపలేకపోతున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తూ... రైతులందరికీ యూరియా ఫ్రీగా అందిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఆ హామీ ఎందుకు నిలబెట్టుకోవడం లేదు.. రైతులకు ఫ్రీగా యూరియా ఎందుకు సరఫరా చేయడం లేదో జవాబు ఇవ్వాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రైతుకు అతి తక్కువ ధరకు యూరియాను సబ్సిడీపై అందిస్తున్నారు. రైతులు చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా చేస్తున్నారు. అందుగురించే ప్రధాని పర్యటనను అడ్డురకోవాలనుకుంటున్నారా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వేల కోట్ల నిధులు వెచ్చించి జాతీయ రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నందుకు ఆ పని చేయొద్దని అడ్డుకోవాలనుకుంటున్నారా ? కారణం ఏదైందీ ప్రజలకు తెలియాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
గతంలో నయీం ఎన్‌కౌంటర్ కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ వ్యవహారం, మియూపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా కేసీఆర్ సర్కారు సిట్ వేసింది. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప చేసిందేమిటి ? ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా అలా నీరుగారిపోవద్దనే ఉద్దేశంతోనే న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో సిట్ బృందం ఏర్పాటు చేసి విచారణ జరపాలని కోరుతున్నాం అని మీడియాకు వెల్లడించారు.
Also Read : Pawan Kalyan Meets PM Modi: ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్ భేటీ ముఖ్యాంశాలు
Also Read : PM Modi Vizag Tour: మోదీ.. మోదీ.. నినాదాలతో మార్మోగిన విశాఖ తీరం.. ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook