Pawan Kalyan To Meet PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన పలు ఆసక్తికరమైన ఘట్టాలకు వేదిక కానుందా అంటే అవుననే తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ సర్కారు స్వయంగా ఏర్పాట్లు చేస్తుండటం ఇందులో ఒక అంశమైతే.. ఏపీ సర్కారుకు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏపీ సర్కారే ఏర్పాట్లు జరుపుతున్న సభకు వస్తోన్న ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ కానుండటం రెండో ఆసక్తికరమైన అంశం కానుంది.
పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ షెడ్యూల్ ఇలా ఉండనుంది..
ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ భేటీ ఖరారు కావడంతో పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ కూడా ఖరారైంది. రేపటి శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి బయల్దేరనున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కల్యాణ్ భేటి కానున్నారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ల భేటీకి సైతం ఏపీ సర్కారు ఏర్పాట్లు పర్యవేక్షించాల్సి రావడం ఆ పార్టీకి ఎంత ఇబ్బందికరమైన పరిణామమో అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్‌తో భేటీ అందుకేనా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణలపై ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌ల మధ్య చర్చకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 12న శనివారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం విశాఖ పర్యటన ముగించుకుని హైదరాబాద్ రానుండగా.. ఆ మరునాడు 13న సాయంత్రం ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
ప్రధాని మోదీ నిర్ణయంపై బుర్ర గోక్కుంటున్న వైసీపీ నేతలు..
ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ భేటీలో ఒకవేళ పవన్ కళ్యాణ్‌తో ఏపీలో పరిస్థితులపై మాట్లాడాల్సి వస్తే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏదో ఒక ఫిర్యాదును ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయినా.. ఒకవేళ ఏపీలో పరిస్థితులపై చర్చించాల్సి వస్తే అందుకు అధికార పార్టీ నేతలను ఎంచుకోవాలి లేదా సొంత పార్టీ అయిన బీజేపి నేతలను ఎంచుకోవాలి కానీ పవన్ కళ్యాణ్‌తో చర్చించడం ఏంటనే సందేహాలు కూడా అధికార పార్టీ నేతల బుర్రలు తొలిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీ సర్కారుకు ఇబ్బందికరమైన పరిణామం ?
ఇదిలావుంటే ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన ఎన్ని ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందో తెలిసిందే. ఈ పర్యటనలో ప్రభుత్వం తనతో కవ్వింపు దోరణికి పాల్పడిందని, తనని, తనతో పాటు జనసైనికులను రెచ్చగొట్టి హింసాఖాండ సృష్టించాలని ఏపీ సర్కారు కుట్ర పన్నిందని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు సైతం న్యూస్ హెడ్ లైన్స్ కి ఎక్కిన సంగతి సైతం తెలిసిందే. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన అనంతరం ఏపీలో వైసీపీ vs జనసేన అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ఏపీకి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత ఇస్తూ తనని కలిసే అవకాశం ఇవ్వడం ఏంటని వైసీపీ వర్గాలు అసహనంతో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం ఘట్టంలో కొసమెరుపు ఏంటంటే.. తమకు నచ్చినా.. నచ్చకపోయినా.. ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్లో ఉన్న కారణంగా ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌ల భేటీకి సైతం ఏర్పాట్లు చూసుకోవాల్సి రావడం ఏపీ సర్కారుకు ఒకింత ఇబ్బందికరమైన పరిణామమే అనేది రాజకీయ పరిశీలకుల మాట.