Minister KTR counter to PM Modi: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్లేమ్ గేమ్ నడుస్తోంది. కేంద్రం విధిస్తున్న సెస్ వల్లే పెట్రో, డీజిల్ ధరలు మండిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదని కేంద్రం ప్రశ్నిస్తోంది. మొత్తం మీద ధరల పెంపుకు మీరంటే మీరే కారణమని ఇరువురు వాదించుకుంటున్నారు. తాజాగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందులో తెలంగాణ పేరు కూడా ఉండటంతో మంత్రి కేటీఆర్ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాము వ్యాట్ పెంచకపోయినా... వ్యాట్ పెంచారంటూ తెలంగాణ పేరును ప్రస్తావించడమేంటని ప్రశ్నించారు. ఇదేనా మీరు మాట్లాడే కోఆపరేటివ్ ఫెడరలిజం అని నిలదీశారు. 2014 నుంచి ఇప్పటివరకూ తాము వ్యాట్ పెంచలేదని... కేవలం ఒకసారి సవరణ చేశామని చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న సెస్‌తో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో 11.4 శాతం లూటీ చేస్తున్నారని ఆరోపించారు. చట్టబద్దంగా తమకు దక్కాల్సిన 41 శాతం వాటాలో కేవలం 29.6 శాతం మాత్రమే దక్కుతోందన్నారు. అసలు సెస్ అనేది రద్దు చేస్తే దేశంలో రూ.70కే లీటర్ పెట్రోల్, రూ.60కే లీటర్ డీజిల్ ఇవ్వొచ్చు అన్నారు.


ఇదే అంశంపై అంతకుముందు టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ కూడా స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ అసలు వ్యాట్ పెంచనే లేదని... పెంచనప్పుడు తగ్గించమని చెప్పడమేంటని మండిపడ్డారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు సెస్‌ల పేరిట భారం మోపుతోందని ప్రశ్నించారు. 


ఇంతకీ ప్రధాని మోదీ ఏమన్నారు.. :


కోవిడ్‌పై సమీక్ష కోసం బుధవారం (ఏప్రిల్ 27) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా పెట్రోల్, డీజిల్ ధరలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించట్లేదన్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు. కోఆపరేటివ్ ఫెడరలిజం స్పూర్తితో ఇకనైనా రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని సూచించారు. మోదీ వ్యాఖ్యలను తెలంగాణ ప్రభుత్వం సహా మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు ఖండించాయి. సెస్‌లో కేంద్రం రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదని... వ్యాట్ వల్లే ధరలు పెరిగాయని చెప్పడం అవాస్తవమని ఆయా రాష్ట్రాలు పేర్కొన్నాయి.




Also Read: Horoscope Today April 28 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది..  


Als Read: TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో కలకలం.. అనూహ్యంగా ప్రత్యక్షమైన మున్నూరు రవి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook