Budget 2024: ప్రజల్లారా ఈ `బడ్జెట్`తో 6 గ్యారంటీలు రావు.. ఆశలు పెట్టుకోవద్దని హరీశ్ రావు సూచన
Telangana Budget: కొత్తగా ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రజలకు ఆరు గ్యారంటీలు దక్కవని చెప్పారు. ప్రజలు వాటిపై ఆశలు పెట్టుకోవద్దని సూచించారు.
Harish Rao Challenge To Revanth Reddy: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ దారుణంగా ఉందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశ పరిచిందని పెదవి విరిచారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు కేటాయింపులు చూస్తే అసలు అమలు సాధ్యమా? అని ప్రశ్నించారు. అంకెల గారడీ తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదని కొట్టిపారేశారు.
Also Read: AP Politics: పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. టీడీపీని చేర్చుకుంటారా లేదా అనేది ఉత్కంఠ
అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్‌లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సోకాల్డ్ ప్రజాపాలన అభాసుపాలైంది. ఒక్క రోజు సీఎం వెళ్లి, ఇప్పుడు ఔట్ సోర్సింగ్ వారు ఉన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం సీఎం ప్రతి రోజూ ప్రజా దర్బార్ నిర్వహించాలి. గతంలో కలెక్టర్లు తీసుకునేది. దానికి దీనికి తేడా ఏమిటి' అని ప్రశ్నించారు. 'కొండంత ఆశలు గోరంత అమలు లేని బడ్జెట్' ఎద్దేవా చేశారు. అంకెలు మార్చి.. ఆంక్షలు పెట్టీ అన్నదాత నోరు కొట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పింది చేంతాడంత, బడ్జెట్ లో ఇస్తున్నది చెంచడంత అని విమర్శించారు. రైతుబంధుకు రామ్ రామ్, రుణమాఫీ వాగ్ధానం రద్దు, పంటలకు బోనస్ బోగస్ అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు.
Also Read: Rythu Bandhu: భూ యజమానులకు రేవంత్ సర్కార్ షాక్.. రైతుబంధు రానట్టే!
'ప్రవేశపెట్టిన రూ.19,746 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌లో జీతాలే రూ.3 వేల కోట్లు అన, మిగతా డబ్బులో పంట బీమా, ఋణ మాఫీ, రైతుబంధు ఎలా అమలు చేస్తారు. ఒక్క రైతు భరోసాకే రూ.22 వేల కోట్లు కావాలి. రుణమాఫీ ప్రకటన లేదు' అని హరీశ్ రావు సందేహాలు లేవనెత్తారు. రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది బడ్జెట్ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరికి బోనస్‌ను బోగస్ చేశారని మండిపడ్డారు. వ్యవసాయానికి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మొత్తం రూ.82 వేల కోట్లు కావాలని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం పెట్టింది మాత్రం రూ.15 వేల కోట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. దగా చేసింది' అని విమర్శించారు.
'24 గంటల విద్యుత్ ఇవ్వడం అబద్దం. ఎక్కడికైనా వెళ్లి చూసేందుకు సిద్దం. సీఎం వస్తారా, మంత్రి వస్తారా రావచ్చు' అని హరీశ్ రావు సవాల్ విసిరారు. మిలీనియం జోక్ బడ్జెట్‌లో ఉందని తెలిపారు. 'ఆ నాడు విద్యుత్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పాము కాటు, విద్యుదాఘాతంతో అన్నదాతలు చనిపోయారు' అని గుర్తుచేశారు. కేసీఆర్ రైతును రాజు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తే, రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నను ఆగం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు మీద చట్టం చేస్తానన్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చెప్పారు. బాండ్ పేపర్లు ఇచ్చారు, నోటరీ ఇచ్చారు హామీలు అమలు చేస్తామని, వాటి ప్రస్తావన లేదని తెలిపారు. అమలు చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని మండిపడ్డారు.
'జనవరి, ఫిబ్రవరి పింఛన్లు రాలేదు. నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. లేదంటే నిరుద్యోగులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తారు' అని హరీశ్ రావు హెచ్చరించారు. నిరుద్యోగులు, ఉద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. 'ఆటో కార్మికుల రుణాలు మాఫీ చేయాలి. నెలవారీ భృతి ఇవ్వాలి. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు. 'మాకంటే రూ.19 వేల కోట్లు అదనంగా అప్పు తెస్తున్నారు. మేము అప్పు చేసామని చెప్పిన మీరే ఇప్పుడు అప్పులు తెస్తున్నారు' అని గుర్తు చేశారు. నేతి బీర నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజం అంత ఉందని దెప్పిపొడిచారు. బడ్జెట్‌తో కేటాయింపులు చేయని కాంగ్రెస్ పార్టీ రైతులు, నిరుద్యోగులకు, మహిళలకు మోసం చేశారని, వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook