Cm Revanth Reddy: సొంతూరిపై రేవంత్ ఫోకస్.. అభివృద్ధిలో తగ్గేదేలే!
Cm Revanth Reddy Effect: కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారా..! అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా..! గతంలో గజ్వేల్‌లో కేసీఆర్ ఫార్ములానే రేవంత్ కొడంగల్‌లో అమలు చేయాలని అనుకుంటున్నారా..! ఇంతకీ కొడంగల్ డెవలప్ మెంట్‌కోసం రేవంత్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి..!
Cm Revanth Reddy Effect: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి సీటులో కూర్చోగానే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్లు నిధులు కేటాయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే నారాయణపేట లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం దాదాపు 3 వేల కోట్లు కేటాయించారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి చొరవతో నారాయణపేట, కొడంగల్ రైల్వేలైన్‌కు రైల్వే శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్దిరోజుల్లోనే కొడంగల్ నియోజకవర్గంలో రైలు కూత వినిపిస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశపడుతున్నారు. మరోవైపు కొడంగల్ అభివృద్ధి కోసం గల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కడాకు శ్రీకారం చుట్టారు. అయితే కడా రాకతో కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అధికారులు చెబుతున్నారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివేందులకు ఎక్కువ నిధులను తీసుకెళ్లారు. అప్పట్లో ఎక్కువ మొత్తంలో పులివేందులకు నిధులు కేటాయించడం పట్ల వైఎస్‌ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. అయినా పట్టించుకోని వైఎస్ పులివేందులే అభివృద్ధే తన టార్గెట్ అన్నట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. ఆయన కూడా చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పీలేరుకు వేల కోట్లు కేటాయించి విమర్శలు ఎదుర్కొన్నారు. కేవలం తాగునీటి కోసమే దాదాపు 7 వేల కోట్లు కేటాయించారంటే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతలా పరితపించారో అర్థం చేసుకోవచ్చు.. ఆయన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రిగా గెలవడమే తరువాయి.. నియోజకవర్గాన్ని అద్దంలా మార్చేశారు. గజ్వేల్‌కు వేలకోట్లు కేటాయించి రూపురేఖల్నే మార్చేశారు. అప్పట్లో ప్రతిపక్షాలు కేసీఆర్ కేవలం గజ్వేల్‌కేనా ముఖ్యమంత్రి అని విమర్శించినా వారిని పట్టించుకోలేదు..
ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సొంత నియోజకవర్గం కొడంగల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొడంగల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకుంటారు. తనకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిన కొడంగల్ ఎంత చేసినా తక్కువే అంటున్నారు. కొడంగల్ అభివృద్ధి కోసం కొడంగల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. గతంలో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు.. ఎప్పుడైతే గజ్వేల్ లో గడా కార్యకలపాలు మొదలయ్యయో.. అప్పటినుంచే గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. గజ్వేల్‌లో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్, పలు కంపెనీలు వచ్చాయి.. అంతేకాదు.. ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్లు, మంచినీరు లాంటివి అందుబాటులోకి వచ్చాయి. దాంతో గజ్వేల్ ప్రాంతంలో ఎకరం భూమి విలువ ఇప్పుడు కోట్లలో పలుకుతోంది. ఇప్పుడు గడా లాగానే కొడంగల్‌లో కడా కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో గత ముఖ్యమంత్రుల స్ట్రాటజీనే ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేలా కనిపించడం లేదు. కేవలం ఒకరిద్దరికీ నష్టం జరగడం వలన అభివృద్ధి ఆగొద్దని చెబుతున్నారు. అవసరమైతే వారికి నష్టం పరిహారం ఎక్కువ మొత్తంలో చెల్లించి అయినా సరే.. కానీ డెవలప్‌మెంట్‌ను మాత్రం పరుగులు పెట్టించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొడంగల్ ప్రాంతానికి ఫార్మా కంపెనీలు తీసుకురావాలని డిసైడ్ అయ్యారట. ఫార్మా కంపెనీల రాకతో కొడంగల్ రూపురేఖలు మారడంతో పాటు.. వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారట. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రతిపక్షాలను పట్టించుకున్న పాపాన పోలేదు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏదీఏమైనా వచ్చే నాలుగేళ్లలో కొడంగల్ రూపు రేఖలు మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. కొడంగల్ డెవలప్ మెంట్ కోసం వేల కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం. అందివచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోవద్దని ఆయన అనుకుంటున్నారట. మొత్తంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామేతను సొంత పార్టీ లీడర్లకు గుర్తు చేస్తున్నారట. చూడాలి మరి రానున్న రోజుల్లో కొడంగల్‌కు సీఎం రేవంత్ ఇంకెన్ని వరాలు ప్రకటిస్తారో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.