హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అత్యవసర వైద్య సేవలు : జీఎంఆర్
హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో హృద్రోగ బాధితుల కోసం సరికొత్త అత్యాధునిక వైద్య పరికరాలు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హృద్రోగ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోన్న ప్రముఖ వాణిజ్య సంస్థ జీఎంఆర్ ప్రకటించింది. ప్రయాణికుల సౌఖ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ విమానాశ్రయం ప్రాంగంణంలో మొత్తం ఏడు ఎమర్జెన్సీ రిససిటేషన్ స్టేషన్స్ (ఈఆర్ఎస్) ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. విమానశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు, సందర్శకులు ఎవరైనా గుండెపోటు, హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతూ అత్యవసరం వైద్య చికిత్స పొందాల్సి వస్తే, వారికి అత్యవసర వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఈ అధునాతన వైద్య పరికరాలు ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్ ఈ ప్రకటనలో పేర్కొంది.
2 యంత్రాలను డొమెస్టిక్ సెక్యురిటీ హోల్డ్ ఏరియా, ఇంటర్నేషనల్ సెక్యురిటీ హోల్డ్ ఏరియా, తనిఖీలు జరిపే ప్రాంతం, దేశీయ ప్రయాణికులు విమానం దిగి వచ్చే ప్రాంతం, అంతర్జాతీయ ప్రయాణికులు విమానం దిగి వచ్చే ప్రాంతంతోపాటు ఎయిర్ పోర్ట్ విలేజ్‌లో ఒక్కో ఈఆర్ఎస్‌ని ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్ స్పష్టంచేసింది. అత్యవసర వైద్య సదుపాయం అవసరమైన హృద్రోగ బాధితులకు ఈఆర్ఎస్ వైద్య పరికరాల ఏర్పాటుతో ఇకపై ఎంతో మేలు జరగనుంది.
హృద్రోగ బాధితులకు అత్యవసర వైద్య సహాయం అందనిపక్షంలో వారి ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. అటువంటి ఇబ్బందులని నివారించడానికే తాము విమానాశ్రయంలో ఈ అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు జీఎంఆర్ తెలిపింది.