Narendra Modi: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదట వేములవాడలోని ప్రముఖ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో కీలక ప్రసంగం చేశారు. మోదీ ఇలా మాట్లాడారు.. 'నిన్న దేశవ్యాప్తంగా మూడో విడుత పోలింగ్ జరిగింది. ఇందులో కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ పోయింది. నాలుగో విడుత పోలింగ్‌కు కూడా చేరువలో ఉన్నాం. ఈ విడతలో కూడా ఆ ఫ్యూజ్ పోవడం బాకీ ఉంది. బీజేపీ, ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుంది' అని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ విజయం ఖాయమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అతి కష్టంపై ఎవరో ఒక అభ్యర్థిని బరిలో దించారు.. అయినా వారు ఓడిపోతారని మోదీ తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vijayashanthi: విజయశాంతి ఎక్కడా? ప్రచారంలో కానరాని రాములమ్మ.. రాజకీయాలకు గుడ్‌బై చెప్పారా?


 


కుటుంబం కోసమే..
'పదేండ్లలో నేనేం చేశానో మీరు చూశారు. మీ ఒక్క ఓటుతో కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేశా. మీ ఒక్క ఓటుతో భారత్ డిఫెన్స్ విభాగంలో ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. భారత్‌లో కానీ తెలంగాణలో కానీ కష్టపడి పనిచేసే సమర్థులకు కొదువలేదు' అని మోదీ పేర్కొన్నారు. 'ఈ పదేండ్లలో బీజేపీ, ఎన్డీయే దేశాన్ని ప్రతి రంగంలో ముందంజంలో ఉండేలా చేసింది. బీజేపీకి నేషన్ ఫస్ట్.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌కి ఫ్యామిలీ ఫస్ట్. బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ.. ఇదే నినాదంతో పనిచేస్తాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. రెండూ ఒక్కటే నాణేనికి బొమ్మ, బొరుసులాంటివి. ఈ రెండు పార్టీలను కలిపేది కరప్షన్, జీరో గవర్నెన్స్ మోడల్. అందుకే మనం కలిసి దేశాన్ని కాపాడుకోవాలి' అని మోదీ ఆరోపణలు చేశారు.

Also Read: KCR Meets Teacher: భావోద్వేగానికి లోనయిన మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్‌


 


పీవీని అవమానించిన కాంగ్రెస్‌
'కుటుంబమే ముఖ్యమనే నీతిని నమ్ముకున్న కాంగ్రెస్. పీవీ నరసిహారావును కూడా అవమానించింది. ఆయన మరణం తర్వాత కాంగ్రెస్ కార్యాలయంలోకి కూడా దేహాన్ని రానివ్వలేదు.. అంత్యక్రియలు కూడా సరిగ్గా జరగనివ్వలేదు. కానీ బీజేపీ పీవీ నరసింహారావును భారతరత్న ఇచ్చి సత్కరించింది. నిన్న వారి కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం నాకు దక్కింది' అని గుర్తుచేశారు.


ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను ఏం చేశారు?
'కరప్షన్ ఒక ఫెవికాల్ లాంటిది. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కామన్ క్యారెక్టర్. ఒకరిపై ఒకరు అవినీతి మీరు చేశారంటే.. మీరే చేశారంటూ విమర్శలు చేసుకుంటారు.. కానీ చివరికి వీటి ఎజెండా మాత్రం అవినీతి చేయడమే. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసింది. ఈ ఆరోపణలు కాంగ్రెస్ కూడా చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఒకరినొకరు కాపాడుకునే పనిలో ఉన్నారు. వీరు అవినీతిలో సిండికేట్ సభ్యులు' అని విమర్శించారు.


ఆర్‌ ట్యాక్స్‌
'కాంగ్రెస్ తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తోంది. ఇప్పుడు దీని గురించే మొత్తం చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పిల్లోడు కూడా దీనిపై మాట్లాడుతున్నాడు. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. కానీ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కలెక్షన్లను కూడా వెనక్కి నెట్టేసింది. ట్రిపుల్ ఆర్‌ సినిమాకు రికార్డు స్థాయిలో లైఫ్ టైం కలెక్షన్ అయితే.. ఆర్ఆర్ ట్యాక్స్‌కు ఈ డబ్బులు కొద్ది రోజుల కలెక్షనే. ఒక ఆర్ తెలంగాణను దోచుకుంటాడు.. దాన్ని ఢిల్లీలోని మరో ఆర్‌కు చేరవేస్తాడు. ఈ ఆటలో యావత్ తెలంగాణను దోచుకుంటారు.. వారి నుంచి విముక్తి కావాలి. కాంగ్రెస్ యువరాజు పొద్దున లేస్తే కొంగ జపం, దొంగ జపం చేస్తారు. రాఫెల్ కుంభకోణం బయటపడిన నాటి నుంచి ఐదేండ్లుగా ఒక్కటే జపం చేస్తున్నారు' అని మోదీ తెలిపారు.


కాంగ్రెస్‌కు సవాల్‌
'అంబానీ, అదానీపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఎన్నికల ప్రకటన రాగానే రాత్రికి రాత్రే విమర్శలు చేయడం, తిట్టడం ఆపేశారు. తెలంగాణ గడ్డపై నుంచి ప్రశ్నిస్తున్నా.. దీనికి కారణమేమిటో కాంగ్రెస్ దేశానికి జవాబు చెప్పాలి. అంబానీ, అదానీ నుంచి ఎంత నల్లధనాన్ని దోచుకున్నారు. ఎన్ని టెంపోల నోట్ల కట్టలు తీసుకున్నారు. ఐదేండ్లుగా తిట్టి ఒక్కసారిగా బంద్ చేశారంటే.. ఎంత దొంగ సొమ్మును టెంపోల్లో తరలించారు' అని మోదీ ప్రశ్నించారు.


ఎంఐఎంపై విమర్శలు
'కాంగ్రెస్, బీఆర్ఎస్.. బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. ఆ పార్టీలు హైదరాబాద్‌ను ఎంఐఎం పార్టీకి లీజుకు ఇచ్చారు. తమకు పోటీ ఇచ్చేది బీజేపీ కావడంతో ఎంఐఎం నేతల్లో ఆందోళన మొదలైంది. ఆ పార్టీ నేతలకంటే ఎక్కువ ఆందోళన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో మొదలైంది. అందుకే ఎంఐఎంను గెలిపించాలని ప్రయత్నిస్తున్నారు' అని మోదీ ఆరోపించారు.


కాంగ్రెస్, ఇండియా కూటమి ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజాన్ని మోసం చేసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. ఇండియా కూటమి పార్టీలు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తిశ్రద్ధలను చూసి దేశం  గర్విస్తోంది. అయోధ్య రామమందిరానికి సంబంధించిన ధ్వజ స్తంభం, దర్వాజలు తెలంగాణలో తయారుచేసినవే.. అవి ఎంతో శోభనిస్తున్నాయి.


'అందరూ సంతోషంగా ఉంటే కాంగ్రెస్ మాత్రం కోపంగా ఉంది. రామమందిరానికి తాళం వేయించాలని చూస్తోంది. గతంలో కాంగ్రెస్ కుటుంబీకులు కలిసి రామ మందిరం నిర్మాణాన్ని నిలిపివేయాలని చూశాయి. కోర్టులోనూ అడ్డుకోవాలని పిటిషన్లు వేశాయి. అలాంటి కాంగ్రెస్ ను తెలంగాణ నుంచి పారదోలుతారా? లేదా? సాఫ్ చేస్తారా? లేదా?. ఈనెల 13న కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాల లెక్కను తేల్చండి. మీ ఒక్క ఓటు నన్ను ప్రధానిని చేస్తుంది. నాకు మద్దతునివ్వండి. గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేయండి' అని పిలుపునిచ్చారు.



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook