Revanth Reddy about Tollywood Drugs Case: హైదరాబాద్: తెలంగాణలో సినీ ప్రముఖుల డ్రగ్‌ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీగ లాగారు. దీంతో, ఈ వ్యవహారం మళ్లీ ప్రకంపనలు రేపనుంది. ఇప్పటికే డొంకలు లాగుతున్న ఈడీ.. ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే టాలీవుడ్‌, పొలిటికల్‌ లింకులపైనా నమ్మలేని నిజాలు బట్టబయలు కావొచ్చంటున్నారు విశ్లేషకులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తును కొందరు నీరు గార్చారని, ఈ కేసును ఈడీ దర్యాప్తు చేయడం మొదలెట్టిన తర్వాత కూడా అవసరమైన సహకారం లభించడం లేదని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఎక్సైజ్‌ అధికారులు ఆధారాలు అప్పగించకుండా తాత్సారం చేస్తున్నారని కన్నెర్ర జేశారు. ఈమేరకు శుక్రవారం రేవంత్‌ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ను కలిశారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ పురోగతి గురించి ఆరా తీశారు. వీలైనంత తొందరగా ఆధారాలను విశ్లేషించాలని, అసలు దోషులను వదిలిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును ఈడీకి గానీ, సీబీఐకి గానీ అప్పగించాలంటూ రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఆ వివరాలను ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌కు అందజేశారు.


గతంలో డ్రగ్స్ ఆనవాళ్లు బయట పడినా.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ పోతుందని కేటీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శించారని.. కానీ, ఇప్పుడు విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్‌ వాసన కనిపిస్తోందని రేవంత్‌ ఆరోపించారు. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ హయాంలో 4 పబ్స్ మాత్రమే ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 90కి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో సినీ ప్రముఖుల డ్రగ్స్‌ కేసు విచారణ ఎందుకు అటకెక్కిందని ప్రశ్నించారు. విచారణాధికారిగా ఉన్న అకున్ సభర్వాల్‌ను అర్థంతరంగా ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. 


అసలేం జరిగింది?
డ్రగ్‌ పెడలర్‌ కెల్విన్‌ అరెస్ట్‌ తర్వాత 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న ఆనవాళ్లు బయటపడ్డాయని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌-సిట్‌ను ఏర్పాటు చేశారు. కెల్విన్‌ వాట్సప్‌ చాట్‌, ఇతర ఆధారాలతో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మొత్తం 12 కేసులు నమోదు చేశారు. 16 మంది టాలీవుడ్ ప్రముఖులను దశలవారీగా విచారించారు. ఒక్కొక్కరినీ విచారించిన సమయంలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సహకారంతో ఆరోపణలు వచ్చిన వాళ్ల చేతిగోర్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు సేకరించారు. ఆ తర్వాత కోర్టులో ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. తమకు వచ్చిన సమాచారం, దొరికిన ఆధారాలతో 16 మంది సినీ ప్రముఖులను విచారించడంతో పాటు.. వాళ్ల నమూనాలు సేకరించామని, అయితే, ఆ నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు బయటపడలేదని చార్జిషీట్‌లో పేర్కొన్న ఎక్సైజ్‌ సిట్‌ వాళ్లందరికీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 


ఈడీ దర్యాప్తులోనే కేసు:
టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌ ఆరోపణలు కూడా వెల్లువెత్తడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ - ఈడీ కూడా విచారణలోకి ఎంటరయ్యింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిందితులకు క్లీన్‌చిట్‌ ఇచ్చినప్పటికీ, ఈడీ మాత్రం దర్యాప్తు కొనసాగిస్తోంది. తొలుత ఈ కేసును ఎక్సైజ్‌ సిట్‌ విచారించడంతో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, విచారణ నివేదికలన్నీ ఎక్సైజ్‌ అధికారుల అధీనంలోనే ఉన్నాయి. అయితే, నిందితులకు క్లీన్‌ చిట్ ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు.. ఈ కేసును ఇంకా దర్యాప్తు చేస్తున్న ఈడీకి మాత్రం రికార్డులు అప్పగించలేదు. ఇదే విషయాన్ని ఈడీ.. ఇటీవలే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. 

మరోవైపు.. ఈ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తును సవాల్‌ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ విచారణ జరుగుతున్న క్రమంలోనే డిజిటల్‌ రికార్డులు ఇంకా ఈడీకి అప్పగించని అంశం బయటకు వచ్చింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందో లేదో తేలాలంటే డిజిటల్‌ ఆధారాలే కీలకమని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, నివేదికలను ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. 


పొలిటికల్‌ హీట్‌ :
టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో తాజా పరిణామాలు తెలంగాణలో మరోసారి ప్రకంపనలు రేపబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు తమ దగ్గరున్న డిజిటల్‌ రికార్డులన్నీ ఈడీకి సమర్పించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మరోవైపు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఈడీ ఉన్నతాధికారులను కలిసి 2017లో టాలీవుడ్‌ లింకుల ఆధారాలు దొరికినప్పటి నుంచీ ఇప్పటివరకూ తెలంగాణలో నమోదైన డ్రగ్స్‌ కేసుల వివరాలను కూడా అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందానికి ఆధారాలు సమర్పించకపోవడాన్ని కూడా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy News) ప్రముఖంగా ప్రస్తావించారు. ఈడీకి ఆర్థిక లావాదేవీల రికార్డులు దొరికితే ఈ కేసులో పొలిటికల్‌ లింకులు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Also read : Vivo Holi Offer: వివో హోలీ ఆఫర్.. వీ23 సిరీస్‌ కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్ పొందే ఛాన్స్...


Also read : AP Cabinet: ఏపీ కేబినెట్​లో త్వరలోనే మార్పులు- సీఎం జగన్​ సంకేతాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook