Hyderabad Honor Killing Case Live Updates: హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య ఇటు పోలీసులకు, అటు అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. నడిరోడ్డుపై జరిగిన సంఘటనపై ఇటు రాష్ట్ర గవర్నర్‌ అధికారులను నివేదిక కోరారు. అటు జాతీయ ఎస్సీ కమిషన్‌ రాష్ట్రంలోని ముఖ్య అధికారులకు నోటీసులు జారీచేసింది. దీంతో, పరువు హత్య సంఘటన పరిణామాలు, పర్యవసానాలు అధికారుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. సరూర్‌నగర్‌లో నడిరోడ్డుపైనే ఓ దళిత యువకుడిని నిందితులు రాడ్‌తో కొట్టి చంపేశారు. పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే అత్యంత దారుణంగా హత్యకు తెగబడ్డారు. తొలుత అక్కడున్న వాళ్లకు ఏం జరుగుతుందో, ఎందుకు ఆ యువకున్ని అంతలా చావగొడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు. వెంట ఉన్న అతని భార్య చంపొద్దని, ఏమీ చేయొద్దని వేడుకుంది. అయినా వాళ్ల మనసు కరగలేదు. చివరకు యువకుడిని చావగొట్టిన దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ తతంగమంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నివేదిక ఇవ్వాలన్న గవర్నర్‌ :
ఈ పరువు హత్యకు సంబంధించి కేసును పోలీసులు అంత సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. పెద్దల ఆదేశాలు, ఇతర కారణాలతో అవసరమైనంతగా దృష్టి సారించలేదన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే, ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై స్పందించారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పరిణామం ప్రభుత్వం వ్యవహారం, అధికారుల పనితీరుకు నిదర్శనంగా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్‌ జోక్యం చేసుకునేదాకా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రత పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందని మండిపడుతున్నాయి. 


తెలంగాణ డీజీపీకి నోటీసులు జారీచేసిన జాతీయ ఎస్సీ కమిషన్ :
మరోవైపు.. ఈ అంశంపై జాతీయ ఎస్సీ కమిషన్‌ కూడా స్పందించింది. మీడియా కథనాలు, ట్విట్టర్‌లో బీజేపీ నేతలు చేసిన ట్వీట్లు, ఇతర సమాచారంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్‌ సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీచేసింది. చట్టం పట్ల కనీస భయం లేకుండా.. జనమంతా చూస్తుండగానే ఇంతటి దారుణానికి పాల్పడ్డారంటే.. మానవ హక్కులను ఘోరంగా ఉల్లంఘించడమే అని ఎస్సీ కమిషన్‌ అభిప్రాయపడింది. ఇలాంటి నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని నోటీసులు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ - డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్‌ ఈ నోటీసులను జారీచేసింది. 


కులాంతర, మతాంతర వివాహాల కేసుల్లో పరువు హత్యలు నిరోధించేందుకు చర్యలు తీసుకున్నారా:
కులాంతర, మతాంతర వివాహాల కేసుల్లో పరువు హత్యలు జరగకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విధానాన్ని రూపొందించుకుందా ? అనే విషయంపైనా క్లారిటీ ఇవ్వాలని వివరణ కోరింది. ఈ కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలతో పాటు.. బాధితుడి భార్య, అతని కుటుంబసభ్యులకు రక్షణ కల్పించేందుకు తీసుకున్న చర్యలను నివేదికలో సమర్పించాలని సూచించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం బాధితుడి భార్య, కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయం అందించిందో కూడా వెల్లడించాలంది. ఈ కేసులో పోలీసుల తప్పిదాలు ఏమైనా ఉన్నాయా ? అని కూడా ఎస్సీ కమిషన్‌ ప్రశ్నించింది. దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా నివేదిక రూపంలో సమర్పించాలని కమిషన్‌ ఆదేశించింది. అంతేకాదు.. ఈ సంఘటనపై ట్విట్టర్‌లో బీజేపీ నేత తరుణ్‌చుగ్‌ చేసిన ట్వీట్‌కు జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విజయ్‌ సాప్లా స్పందించారు. ఎస్సీ కమిషన్‌ నుంచి నోటీసులు జారీచేసినట్లు ప్రస్తావించారు. 


సరూర్‌నగర్ పరువు హత్య కేసులో అసలేం జరిగింది ? 
రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు, ఆ సమీపంలోనే ఉండే పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్‌కు చెందిన యువతి కళాశాలలో చదువుతున్నప్పటి నుంచీ స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమను అమ్మాయి తరపు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. అయితే, అబ్బాయి తరపు కుటుంబసభ్యులను ఒప్పించిన ఇద్దరూ.. ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్‌ పాతబస్తీ లాల్‌దర్వాజలోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, నూతన దంపతుల మీద కక్ష పెంచుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు పలుసార్లు వీళ్లను వెంటాడారు. అమ్మాయి భర్త నాగరాజును హత్య (Hyderabad Honor Killing) చేసేందుకు పలుసార్లు రెక్కీ నిర్వహించారు. చివరకు సరూర్‌నగర్‌ ప్రధాన రహదారిపై అందరూ చూస్తుండగానే ఘోరానికి తెగబడ్డారు. స్వయంగా అమ్మాయి సోదరుడే నాగరాజును సెంట్రింగ్ రాడ్‌తో మోది హత్య చేశాడు. ప్రేమించుకొని మతాంతర వివాహం చేసుకున్నందుకే నిందితులు కక్షగట్టి నాగరాజును హత్య చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.


Also read : Rahul Gandhi:కేసీఆర్‌తో టచ్‌లో ఉంటే సస్పెండ్.. కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్


Also read : Congress Party Warangal Declaration: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షలు రుణమాఫీ: రేవంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.