హైదరాబాద్: తెలంగాణలోని పాత జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం నాడు విద్యా శాఖ సమస్యలపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలిసి తన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పౌజ్ కేసులకు సంబంధించి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించేందుకు వీలైనంత త్వరగా  ప్రతిపాదనలు పంపాలని ఆమె కోరారు. ఉపాధ్యాయ సమస్యలను  పరిష్కరించాలని ముఖ్యమంత్రి  కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకే తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సబిత తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : ఆ బడిలో 200 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్.. ఆ టీచర్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!


ప్రస్తుతం 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు  8వ తరగతి నుంచి 10వ  తరగతి వరకు అప్‌గ్రేడ్ చేస్తూ అనుమతులు మంజూరు చేసే అధికారాలను జిల్లా విద్యా శాఖాధికారులకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి,  పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్ కుమార్, శాసన మండలి సభ్యులు జనార్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.