Srilanka Crisis Explained: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్థిక నిర్వహణలో శ్రీలంక ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఆ దేశాన్ని ఇవాళ అత్యంత ధీన స్థితిలోకి నెట్టాయి. రాజకీయ లబ్దే ప్రధానంగా జాతీయ ప్రయోజనాలు మరుగుపడినచోట ఇలాంటి ఉత్పాతాలే మిగులుతాయి. శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టింది. పన్నులు రద్దు చేసి.. ఆదాయం లేక అప్పుల మీద అప్పులు చేసి... ఉచిత సంక్షేమ పథకాలపై భారీగా ఖర్చు చేసి చేతులు కాల్చుకుంది. ఫలితంగా దేశ ఆదాయం కన్నా ఖర్చులు రెట్టింపయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై కరోనా ప్రభావం చూపించడంతో శ్రీలంకపై కోలుకోలేని దెబ్బ పడింది. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. అప్పులు పేరుకుపోయాయి. ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకింది. నిత్యావసర వస్తువులను సైతం దిగుమతి చేసుకోలేని స్థితికి చేరుకుంది. 2021లో శ్రీలంక ప్రభుత్వం కెమికల్ ఫర్టిలైజర్స్‌పై నిషేధం విధించి రైతాంగాన్ని బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు నెట్టడంతో దేశంలో ఆహార ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. దీంతో తిండికి కూడా కొరత ఏర్పడే పరిస్థితి దాపురించింది.


సాధారణంగా ఏ దేశాలైనా అప్పుల కోసం ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, జపాన్ బ్యాంక్, సింగపూర్ బ్యాంక్‌లను ఆశ్రయిస్తుంటాయి. చౌక వడ్డీతో పాటు రుణ చెల్లింపు గడువు 30 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుంది కాబట్టి సులువుగా అప్పులు తీర్చవచ్చునని భావిస్తాయి. కానీ శ్రీలంక ప్రభుత్వం కమర్షియల్ బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకుని.. వాటిని చెల్లించలేక మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. 


ఓవైపు అప్పులు చెల్లించేందుకు... మరోవైపు నిత్యావసర వస్తువుల దిగుమతి కోసం డబ్బులు లేకపోవడంతో ధరల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు నిజంగానే ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామాలతో దేశంలో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ప్రజలు రోడ్ల పైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఏ ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి ఉచిత సంక్షేమ పథకాలపై శ్రీలంక ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేసిందో... నిజానికి నిజమైన లబ్దిదారులకు అవి దక్కలేదన్న విమర్శలున్నాయి. శ్రీలంక ప్రభుత్వ విధానాలు చివరాఖరికి ఆ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు సహాయం కోసం ధీనంగా ఎదురుచూసే స్థితిలో నిలబెట్టాయి. 


ఒకప్పుడు వెనెజులా కూడా దేశ ప్రజలపై ఉచిత పథకాలు కుమ్మరించి చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసే స్థితికి చేరుకుంది. ఆ సంక్షోభం నుంచి ఇప్పటికీ ఆ దేశం కోలుకోవట్లేదు. వెనెజులా నుంచి పాఠం నేర్చినా నేర్వకపోయినా... శ్రీలంక సంక్షోభం నుంచి మాత్రం పాఠం నేర్వకపోతే ఏ దేశమైనా, రాష్ట్రమైనా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Also Read: Lakshmipati Arrest: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తొలి డ్రగ్స్ మరణం కేసులో కీలక నిందితుడు... 


Petrol price: సామాన్యులపై పెట్రో పిడుగు.. 2014తో పోలిస్తే ధరలు ఎంత పెరిగాయో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


pple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook