విజయవాడ: ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాను కలిసిన అనంతరం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయా అనే ప్రచారం ఊపందుకున్న సంగతి తెలిసిందే. అన్నింటికి మించి ఈ రెండు పార్టీల మధ్య ఇవాళ విజయవాడలో ఓ కీలక సమావేశం జరగనుండటం మరింత ఆసక్తిరేపుతోంది. ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ సమావేశాల్లోనే ఏపీ రాజధాని తరలింపుపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కంటే నాలుగు రోజులు ముందుగా ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థలకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనుండటం కూడా ఈ భేటీకి ఇంకొంత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ.. ఇక తేల్చుకునేందుకు కాకినాడకు!


ఇదిలావుంటే, తాజాగా బీజేపీ, జనసేన పార్టీల సమావేశంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావు స్పందిస్తూ.. వచ్చే నాలుగేళ్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ భేటీకి సిద్ధమైనట్టుగా తెలిపారు. కేవలం రాజధాని అమరావతి విషయమో లేక, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే తమ అజెండా కాదని తెలిపారు. ఏపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న అనేక పరిణామాలు, వాటిపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికే జనసేనతో భేటీ అవుతున్నట్టు స్పష్టంచేశారు. అంతేకాకుండా 2024 ఎన్నికల వరకు ఏపీలో రెండు పార్టీలు కలిసి పనిచేయడంపైనా చర్చ జరుగుతుందని జీవీఎల్‌ తేల్చిచెప్పారు.


మరోవైపు ఈ భేటీలో పాల్గొనే రెండు పార్టీల నేతలు.. భేటీ కంటే ముందుగానే తమ సొంత పార్టీల నేతలతో వేర్వేరుగా భేటీ అయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, అవలంభించాల్సిన వైఖరి గురించి చర్చించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..